అంబర్​పేటలో అదృశ్యమై.. యాదగిరిగుట్టలో ప్రత్యక్షం

అంబర్​పేటలో అదృశ్యమై.. యాదగిరిగుట్టలో ప్రత్యక్షం
  • నలుగురు బాలురును తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

అంబర్​పేట, వెలుగు: అంబర్​పేటలో కనిపించకుండా​పోయిన నలుగురు బాలురు యాదగిరిగుట్టలో ప్రత్యక్ష మయ్యారు. సీఐ అశోక్ వివరాల ప్రకారం.. అంబర్​పేటలోని ప్రేమ్​నగర్​కు చెందిన నలుగురు బాలురు ఎండీ అజ్మత్, కొండపేట తేజనాథ్ రెడ్డి, నితిన్ చౌదరి, హర్షవర్ధన్ స్థానికంగా ఉన్న నవ చైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. స్కూల్లో బుధవారం ఉదయం సోషల్ పరీక్ష నిర్వహించగా, వీరు కాపీ కొడుతూ దొరికారు. దీంతో టీచర్ మందలించి ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు.

సాయంత్రం స్కూల్​ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న విద్యార్థులు యూనిఫాం మార్చుకొని కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాలురు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకొని, అక్కడి నుంచి యాదగిరిగుట్టకు ట్రైన్ లో వెళ్లినట్టు గుర్తించారు. అనంతరం యాదగిరిగుట్టలో వారిని పట్టుకుని గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ అశోక్ తెలిపారు.