హుస్నాబాద్, వెలుగు: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు అన్నదమ్ములు చనిపోయారు. అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన రాజయ్య, కనకయ్య, రాములు, లింగమూర్తి అన్నదమ్ములు. రాజయ్య కొడుకులు కృష్ణ(47), సంజయ్(43), రాములు కొడుకులు సురేశ్(38), శ్రీనివాస్ (36) కొన్నేండ్ల కింద గుజరాత్‌లోని సూరత్‌కు వలస వెళ్లారు.
కృష్ణ ప్లంబర్ వర్క్ కాంట్రాక్టర్‌గా, సంజయ్ డిష్కేబుల్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా... సురేశ్, శ్రీనివాస్ హ్యాండ్లూమ్స్ నడుపుతున్నారు. నాలుగు రోజుల కింద కనకయ్య అనారోగ్యంతో చనిపోగా.. అంత్యక్రియల కోసం భార్యాపిల్లలతో కలిసి సొంతూరుకు వచ్చారు. మూడో రోజు కార్యక్రమం పూర్తికాగా భార్యాపిల్లలను ఇక్కడే ఉంచి, నలుగురు అన్నదమ్ములతో పాటు సురేశ్ కొడుకు భార్గవరామ్(19) మంగళవారం మధ్యాహ్నం కారులో సూరత్‌కు బయలుదేరారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చేరుకోగా టైరు పగిలి కారు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కృష్ణ, సంజయ్, సురేశ్స్పాట్లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను అక్కడి ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతి చెందాడు. భార్గవరామ్ గాయాలతో బయటపడ్డాడు. మహారాష్ట్ర పోలీసులు భార్గవ రామ్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కృష్ణకు భార్య సుష్మ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సంజయ్‌కి భార్య శారద, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సురేశ్‌కు భార్య సరిత, కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య సంగీత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం చౌటపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి.