వరుసగా పేలిన గ్యాస్ సిలిండర్లు.. నలుగురు పిల్లలు సజీవ దహనం

వరుసగా పేలిన గ్యాస్ సిలిండర్లు.. నలుగురు పిల్లలు సజీవ దహనం

పాట్నా: బీహార్‎లో దారుణం జరిగింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. ముజఫర్‌పూర్ జిల్లా బరియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్మణి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. వరుస గ్యాస్ పేలుళ్లతో భయాందోళనకు గురైన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. 

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను విపుల్ కుమార్ (5), బ్యూటీ కుమారి (8), హన్సిక కుమారి (3), శ్రుష్టి కుమారి (4)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ ఘటనపై ముజఫర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రతా సేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సిలిండర్ పేలుళ్ల వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ సంఘటనలో నలుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. ఇళ్లు దెబ్బతిన్న వారికి జిల్లా యంత్రాంగం ఆర్థిక సహాయం అందిస్తోంది’’ అని తెలిపారు.