మల్లారెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ కు షాక్

మల్లారెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ కు షాక్
  • తూంకుంటలోని నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​కు రాజీనామా

శామీర్ పేట/మేడిపల్లి, వెలుగు: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. తూంకుంట మున్సిపాలిటీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు సింగిరెడ్డి రజిని వేణుగోపాల్ రెడ్డి, గుంతల లక్ష్మీకృష్ణారెడ్డి, పొలముల్లా పాండు, కొడిమెల్ల ఉమా ఆంజనేయులు శనివారం బీఆర్ఎస్​పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల్లో ఇండిపెండెట్లుగా పోటీ చేసిన తాము, అభివృద్ధిని కాంక్షిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరామన్నారు. మున్సిపల్​చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు, గతంలో కమిషనర్ గా పనిచేసిన జైత్రం రామ్ నాయక్ ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు, లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెప్పినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ఎలాంటి సహకారం ఇవ్వకుండా, అవమానించినందుకే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు.

డిప్యూటీ మేయర్​ సహా 15 మంది కార్పొరేటర్లు?

పీర్జాదిగూడ కార్పొరేషన్​లోని డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్​గౌడ్ తోపాటు 15 మంది కార్పొరేటర్లు త్వరలో బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. ఇరు వర్గాలను తన చుట్టూ తిప్పుకుంటున్నాడని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. త్వరలో అంతా కలిసి సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​పార్టీలో చేరుతారని సమాచారం. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.