
కామారెడ్డి: ఉగాది పర్వదినాన కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులను మౌనిక (26), మైతిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు.
కాగా, మృతులు బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి మరణించినట్లు తెలుస్తోంది. మొదట పిల్లలు చెరువులోకి స్నానానికి దిగి నీళ్లలో మునిగిపోగా.. వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా నీట మునిగి మరణించినట్లు సమాచారం. చెరువులో నుంచి నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నలుగురు నీళ్లలో మునిగి ఊపిరి ఆడకే చనిపోయారా..? లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
పండగ పూట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందటంతో వెంకటాపూర్ అగ్రహారంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. తల్లి, ముగ్గురు పిల్లల మృతిపై మౌనిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సమగ్రంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.