వడదెబ్బతో నలుగురు మృతి

వడదెబ్బతో నలుగురు మృతి
  • ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో ముగ్గురు, ఖమ్మంలో ఒకరు

తిమ్మాపూర్/జమ్మికుంట/జగిత్యాలటౌన్‌‌‌‌/తల్లాడ, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు, వేడిగాలుల తోడవడంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. శుక్రవారం వడదెబ్బతో ఉమ్మడి కరీంనగర్‌‌‌‌లో ముగ్గురు చనిపోగా, ఖమ్మం జిల్లాలో మరొకరు మృతి చెందారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌‌‌ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రామచంద్రం (26) కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం పనికి వెళ్లిన రామచంద్రం సాయంత్రం ఇంటికి వచ్చాక ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయాడు. 

గమనించిన కుటుంబ సభ్యులు ఆర్‌‌‌‌ఎంపీతో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పించారు. శుక్రవారం ఉదయం కరీంనగర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. అలాగే జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్‌‌‌‌ బోర్డు కాలనీకి చెందిన వొల్లాల వెంకన్న (58) ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎండ తీవ్రత పెరగడంతో వడదెబ్బతో శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు. 

జగిత్యాలలో యువకుడు..

వడదెబ్బ తగిలి ఓ యువకుడు చనిపోయాడు. జగిత్యాలలోని మంచినీళ్ల బావి సమీపంలో ఉంటున్ గొల్లపల్లి జగన్‌‌‌‌గౌడ్‌‌‌‌ (38) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌‌‌ చేర్చారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. జగన్‌‌‌‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తల్లాడలో వృద్ధుడు

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో వడదెబ్బతో ఓ వృద్ధుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన బయ్యారపు దర్గయ్య (70) పశువులను మేపేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు 108లో హాస్పిటల్‌‌‌‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగానే చనిపోయాడు.