కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

వారం రోజుల వ్యవధిలో పిట్టల్లా రాలిపోయిన నాగార్జునరెడ్డి కుటుంబం

కర్నూలు: వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. ఆళ్లగడ్డ సమపంలోని రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన దస్తగిరమ్మ అస్వస్థతకు గురికావడంతో వైద్య చికిత్స చేయించారు. తర్వాత కొద్ది రోజులకు మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో కొడుకు నాగార్జునరెడ్డి (48)తో కలసి ఆస్పత్రికి వెళ్లింది.  ఈ క్రమంలో నాగార్జునరెడ్డి అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా.. పాజిటివ్ అని వచ్చింది. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక ఈ నెల 8వ తేదీన చనిపోయాడు.

వెను వెంటనే తల్లి దస్తగిరమ్మ(70)కు కూడా కరోనా మహమ్మారి సోకండంతో ఆమెను ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తుండగా.. ఫలితం లేకపోయింది. ఈనెల 11న దస్తగిరమ్మ కూడా చనిపోయింది. మూడు రోజుల వ్యవధిలో తల్లి కొడుకులు కరోనాకు బలయ్యారు. ఈ విషాదంలోనుండి తేరుకోక ముందే.. దస్తగిరమ్మ సోదరుడు రాచంరెడ్డి రామిరెడ్డి (80) ఈనెల 12న కరోనాకు గురై చనిపోయాడు. మరుసటి రోజే ఈనెల 13న శుక్రవారం రామిరెడ్డి కుమారుడు రామ్ మోహన్ రెడ్డి కరోనా సోకి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శుక్రవారం కన్నుమూశాడు. వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు కరోనా మహమ్మారికి బలికావడం చుట్టు పక్కల ప్రాంతాలను విషాదంలో ముంచెత్తింది.