మూడువారాల్లో నాలుగు ఎన్‌‌కౌంటర్లు

మూడువారాల్లో నాలుగు ఎన్‌‌కౌంటర్లు

3 వారాల్లో 4 ఘటనలు.. 8 మంది నక్సల్స్​ మృతి

కొద్ది రోజులుగా రాష్ట్రంలో పెరిగిన మావోయిస్టుల కార్యకలాపాల
కూంబింగ్, ఎదురుకాల్పులతో ఏజెన్సీ పల్లెల్లో భయాందోళన

‘తెలంగాణ రాష్ట్రంలో ఎన్​కౌంటర్లే ఉండవ్.. నక్సల్స్​ ఎజెండానే మా ఎజెండా. పౌరహక్కులను కాపాడేందుకు అవసరమైతే నేనే పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉంటా.’ ‑ ఉద్యమనేతగా పలు సందర్భాల్లో కేసీఆర్​

వెలుగు, నెట్​వర్క్​, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల అలజడి, ఎన్​కౌంటర్లు మొదలయ్యాయి. నక్సల్స్​ ఎజెండానే తమ ఎజెండా అని, ప్రత్యేక రాష్ట్రం వస్తే నక్సల్స్​అవసరం రాదని, ఎన్​కౌంటర్లనేవే ఉండవని కేసీఆర్​ పలుసందర్భాల్లో చెప్పిన మాటలు నిజం కాలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో జరిగిన 11 ఎన్​కౌంటర్లలో 26మంది చనిపోగా, గడిచిన మూడు వారాల్లోనే 4 ఎన్​కౌంటర్లలో ఏకంగా 8 మంది మావోయిస్టులు​ మృతిచెందారు.

రాష్ట్రం వచ్చాక 26 మంది మృతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015 జూన్​లో 19 ఏళ్ల వివేక్​ సహా ఇద్దరు మహిళా మావోయిస్టులను ఎన్​కౌంటర్​ చేశారు. అదే ఏడాది  సెప్టెంబర్​15న ఉమ్మడి వరంగల్​ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో శ్రుతి, సాగర్​ పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు.  ఈ ఎన్​కౌంటర్​ విషయంలో టీఆర్ఎస్​ సర్కారుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత చాలాకాలంపాటు మావోయిస్టు కార్యకలాపాలు, ఎన్​కౌంటర్ల ముచ్చటే వినిపించలేదు. అనంతరం 2017 డిసెంబర్​ 14న భద్రాద్రికొత్తగూడెం జిల్లా బోడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో తొమ్మిది మంది సీపీబాట నక్సల్స్​ చనిపోయారు. 2018లో చర్ల అటవీ ప్రాంతంలో ఒక మావోయిస్టును, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో మావోయిస్టు దళ కమాండర్​ను పోలీసులు ఎన్​కౌంటర్ల లో హతమార్చారు. 2019లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో మావోయిస్టు నేత జాడి వీరస్వామిని, గుండాల మండలంలో న్యూడెమోక్రసీ దళకమాండర్​ లింగన్న హతమయ్యారు. ఇక ఈ నెల3న గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్​యాక్షన్​టీం సభ్యుడు శంకర్​మృతిచెందాడు.7న చర్ల మండలం పూసుగుప్త అటవీ ప్రాంతంలో మడవి జోగయ్య, మరో మావోయిస్టు చనిపోయారు. 19న కుమ్రంభీం జిల్లా కాగజ్​నగర్​ మండలం కదంబ ఫారెస్ట్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో జుగున్నాక బాదీరావు, చుక్కాలు అనే ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తాజాగా 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజర్వ్​ ఫారెస్ట్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో సోది జోగయ్య సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.

పెరిగిన మావోయిస్టు కార్యకలాపాలు

కొన్నాళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల యాప నారాయణ అలియాస్​ హరిభూషణ్​ సెక్రటరీగా మావోయిస్టులు తెలంగాణ స్టేట్​కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో బండి ప్రకాష్, బడే చొక్కారావు, మైలారపు ఆడెల్లు, కొయ్యడ సాంబయ్య, కంకణాల రాజిరెడ్డి  మెంబర్లుగా ఉన్నారు. వీరంతా సీనియర్లు కాగా, వీరిలో ముగ్గురికి వివిధ డివిజన్​ కమిటీల బాధ్యతలు అప్పగించారు. మంగులు అలియాస్​ పాండు కమాండర్​గా స్టేట్​యాక్షన్​టీమ్​తో పాటు 8 ఏరియా కమిటీలు, యాలం సంపత్​ భాస్కర్ ​ఆధ్వర్యంలో ఒక కమ్యూనికేషన్ ​టీమ్​ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ లన్నీ ప్రస్తుతం యాక్టివ్ రోల్​ పోషిస్తున్నాయని, ప్రధానంగా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాక, ఉపాధి లేక తీవ్ర నిరాశలో ఉన్న యూత్​ను టార్గెట్​ చేసి, ఉద్యమం వైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక  పోడు, అసైన్డ్​భూములను వివిధ అవసరాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడాన్ని గిరిజన, దళిత, ఇతర బలహీనవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని మావోయిస్టులు జనాలకు దగ్గరవుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇందుకు తగినట్లే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పెద్దసంఖ్యలో సానుభూతిపరులను అరెస్ట్​ చేస్తున్నారు. టీఆర్ఎస్​  రెండోసారి అధికారంలోకి వచ్చాక భద్రాద్రి జిల్లాలోనే దాదాపు 220 మంది మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా, దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల తిర్యాణి అడవుల్లో పోలీసులకు దొరికిన ఆడెల్లు అలియాస్​ భాస్కర్​ డైరీలో10 మంది సానుభూతిపరుల పేర్లు ఉన్నట్లు ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రకటించారు. వీరిలో ఇద్దరు ఆదివాసీ స్టూడెంట్​యూనియన్​నేతలు, ఇద్దరు తుడుం దెబ్బ నేతలు ఉన్నారు.

మావోయిస్టుల కోసం ముమ్మర వేట

లాక్​డౌన్ టైంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోకి మావోయిస్ట్​ దళాలు, ప్రత్యేకంగా పది యాక్షన్​ టీంలు ప్రవేశించాయని నిఘా వర్గాలు పసిగట్టాయి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరి భూషణ్ ఆధ్వర్యంలో ఓ యాక్షన్​ టీమ్​ వరంగల్​ సిటీలో రెండు వారాలపాటు షెల్టర్​ పొందినట్లు తెలుసుకొని పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇక మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా నక్సల్స్​ఏజెన్సీ ప్రాంతాల్లో కరపత్రాలు, ఫ్లెక్సీలతో హల్​చల్​ చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తాత్కాలిక స్తూపాన్ని ఏర్పాటు చేసి అమరులకు ​ నివాళులు అర్పించారు. దీంతో లాక్​డౌన్​ టైంలో దండకారణ్యం నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించారని ఆయా జిల్లాల ఎస్పీలు స్వయంగా ప్రకటించారు. కొన్ని నెలలుగా మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​ను ఆనుకొని ఉన్న సరిహద్దు జిల్లాల్లో వేలాది బలగాలతో కూంబింగ్​ముమ్మరం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా అడవుల్లో ఆడెల్లు అలియాస్​భాస్కర్​టీమ్ కోసం ఏకంగా 500 మందితో కూడిన బలగాలు గాలిస్తున్నాయి. ఒక దశలో డీజీపీ మహేందర్​రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్​వెళ్లి నాలుగురోజుల పాటు అక్కడే ఉండి ఈ కూంబింగ్​ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో గడిచిన మూడు వారాల్లో ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో జరిగిన నాలుగు ఎన్​కౌంటర్లలో 8 మంది మావోయిస్టులను పోలీసులు కాల్చి చంపడంతో ఏజెన్సీ గ్రామాల్లో మరోసారి టెన్షన్​వాతావరణం కనిపిస్తోంది.

For More News..

కేటీఆర్ ఇలాకాలో ట్రాక్టర్ యజమానుల గుస్సా

ఇయ్యాల భారత్ బంద్

పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అంత ఈజీ కాదు