పరకాల, వెలుగు : పోలీసులమని చెప్పి కారు చోరీ చేసిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఇన్చార్జి రూరల్ సీఐ క్రాంతికుమార్ బుధవారం దామెర పీఎస్‌లో మీడియాతోమాట్లాడారు. నడికూడ మండలంలోని రామకృష్ణాపూర్ లో నలుగరు వ్యక్తులు సోమవారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బుల లేకపోవడంతో.. అటుగా వెళ్తున్న కారు ఆపారు. తాము పోలీసులమని చెప్పి, డబ్బులు అడిగారు. అనంతరం కారులో ఉన్నవారిపై కర్రలతో దాడి చేసి, సెల్ఫోన్లు, డబ్బు లాక్కున్నారు. దుండగులు తమ కారులో వెళ్తూ..
బాధితుల కారు కూడా తీసుకుపోయారు. ఈ క్రమంలో కంఠాత్మకూరు సెంటర్లో బారికేడ్లను ఢీకొట్టడంతో.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో దొంగలించిన కారును వదిలేసి , తమ కారులో పరారయ్యారు. బుధవారం పరకాల నుంచి హనుమకొండ వెళ్తూ దామెర క్రాస్‌రోడ్డు వద్ద జాతీయరహదారిపై పోలీసులకు పట్టుబడ్డారు
నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి నుంచి రెండు కర్రలు, ఆరు సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ క్రాంతికుమార్, ఎస్సై కొంక అశోక్ తెలిపారు.