
- నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు, జగిత్యాలలో ఒకరు
అచ్చంపేట/లింగాల/జగిత్యాలరూరల్, వెలుగు : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి, మోటార్లు ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై వేర్వేరు చోట్ల నలుగురు రైతులు చనిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు చనిపోగా, జగిత్యాల జిల్లాలో ఒక రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన రైతులు కాట్రావత్ లోక్యా (30), మూడావత్ కుమార్ (28) కలిసి మోటార్‌ను రిపేర్ చేసేందుకు బుధవారం సాయంత్రం తమ బావి వద్దకు వెళ్లారు.
వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా కనిపించలేదు. గురువారం ఉదయం బావిలోకి దిగి చూడగా ఇద్దరి డెడ్‌బాడీలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మోటార్ రిపేర్ చేస్తుండగా షాక్ కొట్టడంతో బావిలో పడి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లోక్యా తండ్రి చంద్రు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి...
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం సురాపూర్ గ్రామానికి చెందిన దేశ పర్వతాలు (42) పొలానికి నీళ్లు పెట్టేందుకు గురువారం ఉదయం వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అతడి కొడుకు శివ తన ఫ్రెండ్‌తో కలిసి పొలం దగ్గరికి వెళ్లడంతో అక్కడ కింద పడిపోయి గమనించాడు. ఎంత లేపినా లేకపోవడం, స్టార్టర్ డబ్బా వద్ద వైర్లు బయటకు రావడంతో షాక్ కొట్టి చనిపోయినట్లు గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
జగిత్యాల రూరల్ మండలంలో...
జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామానికి చెందిన దేవి చంద్రయ్య (55) ఎకరం భూమిలో నువ్వులు సాగు చేశాడు. పంటకు నీరు పెట్టేందుకు గురువారం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి తీగలు తెగి కిందపడి ఉన్నాయి. గమనించని చంద్రయ్య విద్యుత్ తీగలపై కాలు వేయడంతో షాక్ కొట్టి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.