హైదరాబాద్ లో షవర్మా తిన్న పలువురికి అస్వస్థత

హైదరాబాద్ లో షవర్మా తిన్న పలువురికి అస్వస్థత
  • లోతుకుంట గ్రిల్​హౌస్​లో మరో ఘటన

అల్వాల్, వెలుగు: అల్వాల్​పరిధి లోతుకుంటలోని ‘గ్రిల్ హౌస్’ షవర్మా సెంటర్​ఫుడ్​లవర్స్ కు శాపంగా మారింది. ఎంతో ఇష్టంగా వచ్చి షవర్మా తింటున్న యువత గంటల్లో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు రెండు సార్లు జరిగినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా గ్రిల్ హౌస్ లో షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది.

గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్న పలువురు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అప్రమత్తమైన ఫుడ్​సేఫ్టీ అధికారులు కొంత కాలం కింద ఆ సెంటర్​ను తాత్కాలికంగా క్లోజ్​చేశారు. నాలుగు రోజుల కింద నిర్వాహకులు తిరిగి సెంటర్​ను ప్రారంభించారు. ఈ నెల 6న ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్​కు చెందిన రాజు, బాలసుబ్రహ్మణ్యం అందులో షవర్మా తిన్నారు. తర్వాత కొన్ని గంటల్లోనే వాంతులు, విరోచనాలతో హాస్పిటల్​లో చేరారు.

డిశ్చార్జ్​అయ్యాక శనివారం మీడియాతో మాట్లాడారు. షవర్మా తిన్న నాలుగు రోజుల తర్వాత కూడా కడుపులో మంట తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇలాంటి ఫుడ్​సెంటర్లను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో అల్వాల్ సర్కిల్ ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్​లక్ష్మీకాంత్, శానిటర్  సూపర్​వైజర్ ప్రభాకర్​గ్రిల్​హౌస్​షవర్మా సెంటర్​ను క్లోజ్​చేయించారు. ఈ సెంటర్​కు ట్రేడ్ లైసెన్స్ లేదని తెలిపారు.