ఇటీవల స్ట్రీట్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలవుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆ మధ్య మోమోస్ తిని మహిళ మృతి చెందిన ఘటన మరువకముందే మరోసారి షవర్మ తిని నలుగురు యువకులు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో చోటు చేసుకుంది ఈ ఘటన. శనివారం ( నవంబర్ 9, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
లోతుకుంటలోని గ్రిల్ హౌస్ లో నలుగురు యువకులు షవర్మ తిన్నారు. తిన్న కొద్దిగంటల్లోనే వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు యువకులు. ఘటనపై బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. గత 15రోజుల కిందట ఇదే గ్రిల్ హౌస్ లో షవర్మ తిన్న పలువురు అస్వస్థతకు గురికాగా.. హోటల్ ను మూసివేశారు అధికారులు. తిరిగి మూడురోజుల క్రితం ఓపెన్ చేయగా.. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది. స్ట్రీట్ ఫుడ్ కల్తీని సీరియస్ గా తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.