ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు..యూట్యూబే నా కోచింగ్ సెంటర్

టెక్నాలజీ వాడుకున్నోడికి వాడుకున్నంత.. యూట్యూబే అతని గురువు. ఎన్‌‌ఐటీ మణిపూర్‌‌‌‌లో ఇంజినీరింగ్ చదివినా క్యాంపస్ ప్లేస్‌‌మెంట్స్ కన్నా గవర్నమెంట్ జాబ్ చేయడమే ముఖ్యమన్పించి కోర్సు అయ్యాక ఇంటికొచ్చాడు. తెలంగాణలో ఎస్‌‌ఐగా పనిచేయాలని గోల్ పెట్టుకున్నడు. అలా ప్రిపేరవుతున్న టైంలోనే ఐదు జాబ్‌‌లు వచ్చాయంటున్నాడు భాషవేణి రవితేజ యాదవ్. మహబూబ్‌‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవితేజ తాను అనుకున్న సివిల్ ఎస్ఐ జాబ్‌‌ను సాధించాడు. అలా ఇలా కాదు ఏకంగా స్టేట్‌‌లోనే సెకండ్ ర్యాంకు. దీంతోపాటు వీఆర్‌‌‌‌వో, గ్రూప్‌‌–4, జూనియర్ పంచాయతీ సెక్రటరీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌‌ ఎస్‌‌ఐ జాబ్‌‌లు అదనంగా వచ్చాయి. కానీ ఇప్పుడు తాను అనుకున్న స్టేట్ ఎస్‌‌ఐ జాబులో కాకుండా రైల్వే ఎస్‌‌ఐలో చేరతానని చెబుతున్నాడు. దానికి కారణమేంటో చదవండి..

ఎన్‌‌ఐటీలో బీటెక్..

ఇంటర్ అవ్వగానే జేఈఈలో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ అవగాహన లేకపోవడం, ఆప్షన్స్‌‌ను తప్పుగా అర్థం చేసుకోవడం, ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వస్తే సీటొస్తుందో తెలీక ఆప్షన్స్ ఇచ్చా. దీంతో ఎన్‌‌ఐటీ మణిపూర్‌‌‌‌లో సీటొచ్చింది. ఈసీఈలో జాయిన్ అయ్యా. కోర్సు మధ్యలోనే గవర్నమెంట్ జాబ్‌‌కు ప్రిపేరవ్వాలని డిసైడయ్యా. తెలంగాణ స్టేట్‌‌లో ఎస్‌‌ఐ కావాలని గోల్ పెట్టుకున్న. 2017లో బీటెక్ పూర్తి చేసి అశోక్‌‌నగర్ వచ్చి రూం తీసుకున్నా.  6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ఎన్‌‌సీఈఆర్‌‌‌‌టీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. అప్పటికి నోటిఫికేషన్స్ ఏవీ లేకపోడంతో రిలాక్స్‌‌డ్‌‌గా చదివా.

రైల్వేలోనే జాయిన్ అవుతా..

ఈరోజుల్లో ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్‌‌కు ప్రిపేరవడానికి కోచింగ్ అక్కర్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే యూట్యూబ్‌‌లో బోలెడన్ని వీడియోలున్నాయి. హిందీ వస్తే చాలా అడ్వంటేజ్ ఉంది. ఎందుకంటే సీజీఎల్, సెంట్రల్ సర్వీస్‌‌లకు ప్రిపేరయ్యేవాళ్లకి ఈజీగా ప్రాబ్లమ్స్‌‌ ఎలా సాల్వ్ చేయాలో తెలిపే వీడియోలు వేలల్లో ఉన్నాయి. వాటిని చూసి నేర్చుకుంటే ఎగ్జామ్‌‌లో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయెచ్చు. నాన్న లక్ష్మి నరసింహ యాదవ్ సివిల్ కాంట్రాక్టర్, అమ్మ రాధ ఇంట్లో ఉంటారు. చెల్లెలు భార్గవి యాదవ్ ఎంబీబీఎస్ చదువుతోంది. స్టేట్ ఎస్‌‌ఐగా కంటే ఆర్‌‌‌‌పీఎఫ్‌‌ ఎస్‌‌ఐగానే వెళ్లాలనుకుంటున్నా.  రైల్వేలో జాబ్‌‌ ప్రొఫైల్ బాగుంది, ప్రమోషన్ల పరంగానూ బెటర్.  అందుకే అటువైపే వెళ్దామని డిసైడయ్యా. ఈ నెలాఖరులో ఖరగ్‌‌పూర్‌‌‌‌లో ట్రైనింగ్ ఉంటుందనుకుంటున్నా. ఆర్డర్స్ రాగానే వెళ్లి జాయినై పోతా.

– మహబూబ్‌‌నగర్, వెలుగు

ఐదు రాస్తే ఐదు..

2018లో ఆర్‌‌‌‌పీఎఫ్‌‌ ఎస్‌‌ఐ, స్టేట్ ఎస్‌‌ఐ నోటిఫికేషన్లు రెండూ ఒకేసారి వచ్చాయి. రైల్వే, స్టేట్ ఎగ్జామ్‌‌ సిలబస్‌‌ దాదాపు సేమ్. ఒక్క తెలంగాణ ఉద్యమం ఒక్కటే మనకు ఎక్స్‌‌ట్రా ఉంటుంది. ఆర్‌‌‌‌ఎస్ అగర్వాల్ పుస్తకాన్ని రెండు సార్లు ప్రాక్టీస్ చేశా.  నెలరోజులపాటు సిలబస్ రివిజన్ చేశా. ఈ మధ్యలోనే వీఆర్‌‌‌‌వో, పంచాయతీ సెక్రటరీ, గ్రూప్‌‌–4 నోటిఫికేషన్లు వచ్చాయి. వాటికేం స్పెషల్‌‌గా ప్రిపేర్ కాలేదు, క్యాజువల్‌‌గా రాశా. ఇప్పటివరకు ఐదు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఐదు జాబులు వచ్చాయి. ఎస్‌‌ఐ స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. టీఎస్‌‌పీఎల్‌‌ఆర్‌‌‌‌బీ వాళ్లకు రూ. 3000 కడితే ర్యాంకు కార్డు ఇస్తారు. అలా నా మార్కులు చూసుకున్నా. 286 వచ్చాయి, ఇందులో మ్యాథ్స్‌‌లోనే నాకు 161 స్కోర్ వచ్చింది.