మరో నలుగురిని రిలీజ్ చేసిన హమాస్

మరో నలుగురిని రిలీజ్ చేసిన హమాస్
  • మరో నలుగురిని రిలీజ్ చేసిన హమాస్
  • బదులుగా 200 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తున్న ఇజ్రాయెల్.

టెల్ అవీవ్: మరో నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ కు చెందిన మహిళా సైనికులను వదిలిపెట్టింది. శనివారం గాజా సిటీలోని పాలస్తీనా స్క్వేర్ వద్ద వాళ్లను రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు అప్పగించింది. బందీలను మిలటరీ డ్రెస్సుల్లో తీసుకొచ్చిన హమాస్.. పాలస్తీనా స్క్వేర్ వద్ద ప్రజలందరి సమక్షంలో రెడ్ క్రాస్ కు అప్పగించింది. ఈ సందర్భంగా తాము క్షేమంగా ఉన్నామంటూ మహిళా సైనికులు థంప్సప్ సింబల్ చూపించారు. అక్కడి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ వాహనాల్లో బయలుదేరి ఇజ్రాయెల్ చేరుకున్నారు. అక్కడ తమ కుటుంబసభ్యులను కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వీళ్లకు ఇజ్రాయెల్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. హమాస్ చెర నుంచి బయటపడడంపై ఆనందం వ్యక్తం చేశారు. టెల్ అవీవ్ లోని హాస్టేజెస్ స్క్వేర్ వద్ద జనమంతా గుమిగూడి, బందీల అప్పగింతను బిగ్ స్క్రీన్ లో వీక్షించారు.  కాగా, విడుదలైన మహిళా సైనికుల్లో కరీనా అరివ్ (20), డానియెల్లా గిల్బోవా (20), నామా లెవీ (20), అల్బాగ్ (19) ఉన్నారు. కాగా, యెమెన్ లోని హౌతీ రెబెల్స్ స్వచ్ఛందంగా 153 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేశారు.

70 మంది ఖైదీలు రిలీజ్.. 

నలుగురు బందీలను హమాస్ విడుదల చేయగా, బదులుగా 200 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తున్నది. ఇందులో 70 మందిని శనివారం రిలీజ్ చేసింది. మిగతా ఖైదీలను ఆదివారం విడుదల చేయనుంది. కాగా, చనిపోయిన హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ కు సంబంధించిన మరో వీడియో బయటకొచ్చింది. గాజాలో అతడు కట్టె పట్టుకుని, బ్లాంకెట్ కప్పుకుని తిరుగుతున్నట్టు అందులో ఉంది.