అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి

కింగ్ సిటీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సెంట్రల్ కాలిఫోర్నియాలో ఓ ఇంటి ముందు పార్టీ జరుగుతుండగా.. దుండగులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్​ సిటీలో ఆదివారం సాయంత్రం ఓ ఇంటి ముందు పార్టీ జరుగుతోంది. సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో వారంతా పార్టీలో మునిగిపోయారు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన ముగ్గురు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో జనం ప్రాణభయంతో పరుగులు పెట్టారు. బుల్లెట్ గాయాలతో కొంతమంది కింద పడిపోగా.. మరికొందరు తప్పించుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో మహిళ చనిపోయింది.  కాగా, దుండగులు వచ్చినంత వేగంగా అక్కడి నుంచి పారిపోయారని, ముసుగులు ధరించడం వల్ల వారిని ఎవరూ గుర్తుపట్టలేదని వివరించారు. కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని, నిందితులను తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.