- ఏకకాలంలో బైపాస్‌లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల నిర్మాణం
- బిట్లుగా విభజించి పూర్తి చేస్తున్న వైనం
- 68కి.మీ రోడ్డుకు రూ.2,146కోట్లు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్– వరంగల్ మధ్య చేపట్టిన ఫోర్ లైన్ హైవే పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి. ఏకకాలంలో బిట్లు, బిట్లుగా బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, బైపాస్‌లు నిర్మిస్తుండడంతో పనుల్లో వేగం పెరిగింది. ఇదే వేగంతో పనులు కొనసాగితే వచ్చే 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 68 కి.మీ పొడవున నిర్మిస్తున్న ఈ హైవేకు కేంద్రం ప్రభుత్వం రూ.2146కోట్లు కేటాయించింది.
ఈ పనులను నిరుడు జులై 8న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అప్పటికే 258 హెక్టార్ల భూసేకరణ పూర్తి కావడంతో పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో 46.24 కి.మీ, హనుమకొండ జిల్లా పరిధిలో 21.77 కి.మీ రహదారి నిర్మాణం సాగుతోంది.
45 నుంచి 60 మీటర్ల వెడల్పుతో బైపాస్‌లు
ఈ నేషనల్ హైవే మొత్తం 30 గ్రామాలను కవర్ చేస్తుండగా.. మానకొండూర్, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్ పర్తి సమీపంలో మాత్రం బైపాస్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఐదు పట్టణాలు, గ్రామాల మీదుగా ప్రస్తుతం ఉన్న రోడ్డు కాకుండా పక్క నుంచి హైవే నిర్మాణం జరుగుతోంది. 45 నుంచి 60 మీటర్ల వెడల్పుతో బైపాస్‌లు నిర్మిస్తున్నారు. లాంగ్ జర్నీ చేసే కార్లు, ఇతర భారీ వాహనాలు రోడ్డు పక్కన నిలిపేందుకు అక్కడక్కడ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. బైపాస్ లతోపాటు రెండు చోట్ల ఆర్‌యూబీ(రోడ్డు అండర్ బ్రిడ్జి), ఆర్వోబీ(రోడ్డు ఓవర్ బ్రిడ్జి)లు నిర్మించబోతున్నారు.
Also Read : సీఎంఆర్‌పై సీరియస్ వనపర్తి జిల్లాలో 37 రైస్ మిల్లులు డీఫాల్ట్‌గా గుర్తింపు,ఆరింటిపై కేసులు
తగ్గనున్న ప్రమాదాలు..
గ్రానైట్ లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాల రద్దీ కారణంగా కరీంనగర్ - హనుమకొండ హైవే యాక్సిడెంట్స్ కు నిలయంగా మారింది. ఈ రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతోపాటు మూలమలుపుల దృష్ట్యా ఇప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సగటున నెలకు 40కిపైగా యాక్సిడెంట్లు జరుగుతాయని అంచనా. అందుకే ఈ రహదారి విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైవే నిర్మాణం పూర్తయితే ప్రజలకు దూరం భారం తగ్గడంతోపాటు సమయం కలిసిరానుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి.