వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

ముస్తాబాద్ వెలుగు: ముస్తాబాద్ మండలంలోని గూడెం – నామాపూర్ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బంజర్ పల్లికి చెందిన సడిమెల వంశీ తన బైక్​పై శ్యాగ రుచిత (20), సుహిత (18) లతో బంజేరుపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో రామిరెడ్డి పల్లె మూలమలుపు వద్ద వడ్ల లోడుతో వేగంగా వస్తున్న లారీ బైక్ ని ఢీకొంది. ప్రమాదంలో రుచిత అక్కడికక్కడే మృతి చెందగా, సాహితీ, వంశీలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108 లో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు  సీఐ ఉపేందర్ తెలిపారు.

లారీ ఢీకొని యువకుడు..

పెద్దపల్లి (కాల్వశ్రీరాంపూర్), వెలుగు: లారీ ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు. ఈ సంఘటన కాల్వ శ్రీరాంపూర్ ​మండలం మంగపేటలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సతీశ్ గౌడ్(36) హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకొని శనివారం ఇంటికి వెళ్లే క్రమంలో అటుగా వస్తున్న లారీ మంగపేట వద్ద వేగంగా ఢీకొంది. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సతీశ్​ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య మౌనిక, కూతుళ్లుహన్సిక, సాత్విక ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కాల్వ శ్రీరాంపూర్​ ఏఎస్సై రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వలస కార్మికుడు..

మల్లాపూర్, వెలుగు: అక్రమ ఇసుక రవాణా లో వలస కార్మికుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన దొరంగుల దేవ్ కర్(40) ఉపాధి కోసం మెట్ పల్లి లో  కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ శివారులో ఉన్న వాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక లోడ్ తో వెళ్తుండగా మార్గమధ్యలో దిగబడింది. ట్రాక్టర్ ను బయటికి తీయడానికి దేవ్ కర్ బరువు కోసం ఇంజన్ బంపర్ పై నిలబడ్డాడు. ఒక్కసారిగా ఇంజన్ పైకి లేవడంతో బంపర్ పై ఉన్న రాడ్​దేవ్ కర్ కు గుచ్చుకొని గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందాడు.

మెట్ పల్లి, వెలుగు: మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇబ్రహీంపట్నం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం గ్రామానికి చెందిన మాడ హన్మండ్లు (40) మోర్తాడ్ లో నివాసం కూలీ పని చేస్తూ  జీవిస్తున్నాడు. శనివారం తన స్నేహితుడు లక్ష్మణ్​తో కలిసి బైక్​పై మెట్ పల్లికి వచ్చి మోర్తాడ్ కు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మేడిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వెహికల్​బైక్​ను ఢీకొంది. ప్రమాదంలో హన్మండ్లు తలకు తీవ్రగాయాలు అవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణ్​కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి భార్య నర్సవ్వ, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.