మణుగూరు, వెలుగు: నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్లను అరెస్టు చేసి, వారి నుంచి జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డీఎస్పీ ఎస్వీ రాఘవేంద్రరావు మంగళవారం తెలిపారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన వివరాలు వెల్లడించారు. చర్ల మండలం కర్నేపల్లికి చెందిన ఇర్ఫా రామారావు మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు చంద్రన్న, బడే చొక్కా రావు దళంలో మెంబర్ గా పని చేసేవాడు. వారికి కావాల్సిన సామాను అందిస్తుండేవాడు.
అతడికి అశ్వాపురం మండలం కట్టంవారిగూడెం గ్రామానికి చెందిన కొమరం అర్జున్, అమెర్థ గ్రామానికి చెందిన గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, అమ్మగారి పల్లి గ్రామానికి చెందిన కన్నబోయిన వెంకటేశ్వర్లు సహకరించేవారన్నారు. ఈ నలుగురు పేలుడు పదార్థాలు తీసుకొని మావోయిస్టులకు అందించేందుకు వెళ్తున్నారని తెలియడంతో నిఘా వేసి అరెస్టు చేశామన్నారు. 8 జిలిటెన్ స్టిక్స్, 50 మీటర్ల కార్టెక్స్ వైర్ ను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు పాల్గొన్నారు.