మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ లీడర్ మున్నూరు రవిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మే 08 ఆదివారం అర్థరాత్రి మైత్రి ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కూర్చొని ఉన్న రవిపై నలుగురు దుండగులు అకస్మాత్తుగా వచ్చి దాడికి దిగారు. ముందు పిడిగుద్దులు, ఆ తర్వాత రాళ్లతో దాడి చేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఈ దాడిలో రవి చేతికి, ముక్కుకు గాయాలయ్యాయి. దాడికి సంబంధించిన దృశ్యా లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
స్థానికులు రవిని కాపాడేందుకు ప్రయత్నించారు. గాయపడిపన అతన్ని వెంటనే మహబూబ్‌నగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కారణామని మున్నూరు రవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కొడుక్కు ఏమైనా అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దే బాధ్యత అంటూ రవి తల్లి చెబుతున్నారు.
రాజకీయంగా ఎదుగుతున్న తన బిడ్డపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడ్డాడని రవి తల్లి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో మున్నూరు రవి నిందితుడిగా ఉన్నారు.