ఇంట్లో నలుగురు మృతి.. ఒక్కోచోట ఒక్కొక్కరి మృతదేహం

విష ప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానాలు
ఇంటి వెనక గుప్తనిధుల కోసం తవ్విన ఆనవాళ్లు

వనపర్తి, వెలుగు: తమ పాత ఇంట్లో గుప్తనిధుల ఉన్నాయని ఆ మహిళ నమ్మకం. వాటిని ఎలాగైనా వెలికి తీయాలని కూతురు, అల్లుడు, మనుమరాలిని పిలిపించింది. తెల్లారేసరికి వారంతా అదే ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ఈ ఘటన శుక్రవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన
హజీరా బేగం(60)కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కూతుళ్లకు పెళ్ళల్లయ్యాయి. కొడుకు నాగర్ కర్నూల్ లో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ ప్రాక్టీ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. హజీరాబేగం భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. దీంతో నాగర్ కర్నూల్ లో కొడుకు వద్ద ఉంటోంది. నాగపూర్ గ్రామంలో తమ ఇంట్లోగుప్తనిధులు ఉన్నాయని హజీరా బేగం తరచూ కొడుకు, కూతుళ్లతో చర్చించేది. బుధవారం మహబూబ్ నగర్ లో ఉంటున్న తన కూతురు ఆస్మా(38), అల్లుడు ఖాజాపాషా(42), మనుమరాలు హస్రీన్ (7) ను నాగపూర్ కు పిలిపించింది. గురువారం రాత్రి కూతురు, అల్లుడును ఒప్పించి గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. అనంతరం ఏం జరిగిందో తెలియడం లేదు. వీరంతా అనుమానాస్పదంగా మృతి చెందారు. ఖాజాపాషా మృతదేహం ఇంటి ఆవరణలో పడి ఉండగా మిగిలిన ముగ్గురి మృతదేహాలు ఒక్కోచోట పడి ఉన్నాయి. మృతదేహాల పక్కనే నిమ్మకాయలు, అగర్బత్తీలు, పసుపు, కుంకుమ పెట్టి పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి.
ఇంటి ఆవరణలో గుప్త నిధుల కోసం తీసిన గుంతలు ఉన్నాయి. క్షుద్రపూజలు వీరే చేశారా? ఎవరైనా చేసి వీరిని హతమార్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హజీరా బేగం మృతదేహం వద్ద పోలీసులకు పాయిజన్ బాటిల్ లభించింది. ఆమె నమాజ్ చేస్తూనే చనిపోయినట్లుగా శవం పడి ఉంది. ఆమె కూతురు ఆస్మా శవాన్ని బైటి నుంచి లాగి లోపల వేసినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు. హస్రీన్ నోటి నుంచి నురుగు రావడంతో విషప్రయోగం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

చిన్నారి శరీరంపై గాయాలు
ఇంట్లో అనుమానాస్పదంగా మృతదేహాలు పడిఉండటం చూసిన నాగపూర్ గ్రామస్థులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. ఇంటి వద్ద పడి ఉన్న నిమ్మకాయలు, అగర్బత్తీలు వీరే కొన్నారా లేక
మరెవరైనా ఈ పని చేసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి శరీరంపై
అక్కడక్కడా గాయాలు ఉండడంతో ఈ పని కుటుంబసభ్యులు చేసి ఉండరని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏదైనా కక్షతో వీరిని పథకం ప్రకారం హత్యలు చేశారేమోనని అనుమానిస్తున్నారు. ఇంట్లోగుప్తనిధులు ఉన్నాయని గతంలో అందరూ కలిసి అన్వేషణ చేశారని గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసును అన్ని కోణాల్లోదర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

For More News..

ఆపరేషన్ మేడ్చల్.. యాక్షన్ ప్లాన్ షురూ..

చైనాకు రాష్ట్రపతి కోవింద్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్

గల్వాన్‌ గొడవలో మా బాధ్యత లేదు