
- భద్రాచలం వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు..
- నల్గొండ జిల్లా నక్కలగండి ప్రాజెక్ట్ లో పడి అన్నాతమ్ముడు మృతి
భద్రాచలం/దేవరకొండ (చందంపేట), వెలుగు : భద్రాచలం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు చనిపోగా, సరదాగా ఆడుకునేందుకు నీటిలోకి దిగి అన్నాతమ్ముడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లికి చెందిన హరిప్రసాద్ (18) భద్రాచలంలోని డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
ఇతడు తనకు బంధువైన ఖమ్మం జిల్లా కోయచెలక గ్రామానికి చెందిన పవన్ (20)తో పాటు మరో ముగ్గురితో కలిసి శుక్రవారం సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చాడు. దర్శనానికి ముందు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ముగ్గురు నది ఒడ్డున స్నానం చేస్తుండగా, హరిప్రసాద్, పవన్ మాత్రం నీటిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గజ ఈతగాళ్లు నదిలోకి దిగి గాలించగా ఇద్దరి డెడ్‌బాడీలు దొరికాయి.
నక్కలగండి రిజర్వాయల్‌లో పడి..
సరదాగా ఆడుకునేందుకు నీటిలోకి దిగిన అన్నదమ్ములు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నక్కలగండి తండాకు చెందిన కాట్రావత్ రూప్లా, సరోజ దంపతులకు ముగ్గురు కొడుకులు.
శుక్రవారం దంపతులు పని నిమిత్తం దేవరకొండకు రాగా, ముగ్గురు కొడుకులను పల్లి చేను వద్దకు పంపించారు. చేను వద్దకు వెళ్లిన ముగ్గురిలో హరిప్రసాద్ (6), బిట్టు (5) కలిసి ఆడుకునేందుకు పక్కనే నిర్మాణంలో ఉన్న నక్కలగండి ప్రాజెక్ట్‌లోకి దిగారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయారు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే నీటిలోకి దిగి ఇద్దరిని బయటకు తీయగా అప్పటికే చనిపోయారు.