నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం

నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం
  • చోరీ కేసులు పెడుతూ పోలీసులు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో

కోల్‌‌బెల్ట్‌‌, వెలుగు : పోలీసులు వేధిస్తున్నారంటూ నలుగురు యువకులు ఒకేసారి ఆత్మహత్యకు యత్నించడం మంచిర్యాల జిల్లా మందమర్రిలో కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నానికి ముందు యువకులు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్‌‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే... మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌‌కు చెందిన ఆవుల షారూఖ్‌‌, మేశ్రం రాజు, యాపల్‌‌ ప్రాంతానికి చెందిన బామండ్ల శివ, సెగ్గం అజయ్‌‌కుమార్‌‌ గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తర్వాత తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి, హెయిర్ డై తాగారు. 

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకులను హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. అయితే పోలీసుల వేధింపులు తట్టుకోలేక తాము ఆత్మహత్యాయత్నం చేసినట్లు యువకులు సెల్ఫీ వీడియోలో చెప్పారు. ‘పోలీసులు తమపై లేనిపోని కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు, సంతకాల పేరుతో స్టేషన్‌‌కు పిలిపిస్తుండడంతో ఏ పని చేసుకోలేకపోతున్నాం, తమ కుటుంబ సభ్యులను ఇష్టారీతిన తిడుతున్నారు, చేయని దొంగతనాన్ని ఒప్పుకోవాలని వేధిస్తున్నారు’ అని చెప్పారు. 

మరో చోరీ కేసులో విచారణకు రావాలని మందమర్రి ఎస్సై రాజశేఖర్‌‌ గురువారం ఫోన్‌‌ చేశాడని, ఉదయం పోలీసులు తమ ఇండ్లకు వచ్చారన్నారు. టౌన్‌‌ ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్స్ సంపత్, అజయ్‌‌ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో చెప్పారు.

కేసుల నుంచి తప్పించుకునేందుకే : ఎస్సై రాజశేఖర్‌‌

గత నెల 14న మందమర్రి పట్టణంలో మూసివేసిన కేకే 1 గని నుంచి ఇనుప స్క్రాప్ చోరీ చేసేందుకు వెళ్లిన ఆరుగురు వ్యక్తులు సెక్యూరిటీ గార్డ్‌‌ రాజయ్యపై దాడి చేశారని, ఈ దాడిలో షారూఖ్‌‌, రాజు, శివ, అజయ్‌‌కుమార్‌‌ కూడా ఉన్నారని మందమర్రి ఎస్సై రాజశేఖర్‌‌ చెప్పారు. నలుగురు యువకుల్లో షారుఖ్‌‌పై నాలుగు కేసులు, రాజుపై ఏడు, బామండ్ల శివపై మూడు, సెగ్గం అజయ్‌‌కుమార్‌‌పై మూడు కేసులు ఉన్నాయన్నారు. తాము యువకులను వేధించలేదని, కేసుల నుంచి తప్పించుకునేందుకు వారు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.