ఊరంతా అప్పులు చేసిన కొడుకు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

ఊరంతా అప్పులు చేసిన కొడుకు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం
  • ఆత్మహత్యాయత్నం చేసిన నలుగురు మృతి
  • మంచిర్యాల జిల్లా కాసిపేటలో విషాదం
  • స్టాక్​ మార్కెట్​లో నష్టాలే కారణం

తాండూరు, వెలుగు: అప్పుల బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. స్టాక్​మార్కెట్​లో వచ్చిన నష్టాలు, వాటిని తీర్చేందుకు చేసిన అప్పులు ఆ కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నాయి. అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో మంగళవారం తెల్లవారుజామున నలుగురు గడ్డి మందు తాగారు. వీరిని బంధువులు వరంగల్​లోని ఎంజీఎం హాస్పిటల్​కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోయారని పోలీసులు తెలిపారు.

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు. వీరికి కూతురు చైతన్య, కొడుకు శివప్రసాద్ ఉన్నారు. గ్రామంలోనే మొండయ్య చిన్న కిరాణాకొట్టుతో పాటు పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొడుకు శివప్రసాద్ స్టాక్​మార్కెట్​లో పెట్టుబడుల కోసం ఊళ్లో అప్పులు చేశాడు. చివరికి రూ.లక్షల్లో నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసుకుంటూ వెళ్లాడు.

ఇలా రెండున్నర సంవత్సరాల కిందే మొత్తం అప్పు రూ.31 లక్షలు ఉన్నట్లు తెలిసింది. వీటికి వడ్డీలు పెరిగిపోయి తీర్చలేనంత భారంగా మారిపోయాయి. దీంతో శివప్రసాద్​పై అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది. ఈ బాధలు తట్టుకోలేక ఏడాది కింద విజయవాడ వెళ్లి కృష్ణా బ్యారేజ్ పై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడి పోలీసులు అతన్ని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ శివప్రసాద్​పై అప్పుల వాళ్ల ఒత్తిడి మొదలైంది. దీంతో అప్పులోళ్లు గ్రామంలో పంచాయితీ పెట్టారు. గత నవంబర్ 30 వరకు డబ్బులు చెల్లిస్తానని శివప్రసాద్ ఒప్పుకున్నాడు. ఆ గడువు దాటిపోవడంతో మళ్లీ డిసెంబర్ 10 వరకు పొడిగించాడు.

Also Read : బిల్డింగ్ రెడీ అయినా.. కరెంట్​ ఇయ్యలే ఐటీఐకి మోక్షమెప్పుడు?

ఈ పరిస్థితుల్లో మొండయ్యతో పాటు శివప్రసాద్ కు అప్పుల వాళ్ల భయం పట్టుకున్నది. అప్పులు తీర్చడానికి వేరే మార్గం లేకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున నలుగురు గడ్డి మందు తాగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వీరిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​కు తరలించారు. బుధవారం ఉదయం మొండయ్య (58), శ్రీదేవి (53), చైతన్య (30) చనిపోగా.. మధ్యాహ్నం శివప్రసాద్ (26) మృతి చెందాడు. నలుగురి డెడ్​బాడీలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొండయ్య బంధువు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.