- గత నెల 30న వారిని చండూరు సభకు తీసుకెళ్లిన కేసీఆర్
- 3న ప్రెస్‌మీట్‌లోనూ వారికే ప్రయారిటీ
- మునుగోడు రిజల్ట్ తర్వాతైనా బయటికి వస్తారా?
హైదరాబాద్, వెలుగు: ఫామ్‌హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ దాటి బయటికి రావట్లేదు. 11 రోజులుగా వాళ్లు అక్కడే ఉంటున్నారు. రెండుసార్లు మాత్రమే ప్రజలకు కనిపించారు. గత నెల 30న చండూరు మండలంలో నిర్వహించిన మునుగోడు బైపోల్ ప్రచార సభకు ఆ నలుగురిని కేసీఆర్ వెంటబెట్టుకెళ్లారు. మునుగోడు పోలింగ్ తర్వాత ఈ నెల 3న ప్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ కేసీఆర్ వారికి ప్రాధాన్యత ఇచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఈ రెండు సందర్భాలను మినహాయిస్తే మిగతా రోజుల్లో నలుగురు ఎమ్మెల్యేలు హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న ప్రగతి భవన్‌ను దాటి కాలు బయట పెట్టలేదు. తమ కుటుంబ సభ్యులకు దూరంగానే ఉంటున్నారు. టీఆర్‌ఎస్ సర్కారును కూల్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర పన్నిందని, దాన్ని తమ ఎమ్మెల్యేలు బయట పెట్టారని కేసీఆర్ చెబుతున్నారు. వారి భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ నలుగురికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్‌తో పాటు 4 + 4 గన్‌మన్‌లను ఇచ్చారు. అయినా వారిని ప్రగతి భవన్ నుంచి మాత్రం బయటకు పంపడం లేదు.
అక్టోబర్ 26 నుంచి..
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు), రేగా కాంతారావు (పినపాక), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), గువ్వల బాలరాజు (అచ్చంపేట) అక్టోబర్ 26న సాయంత్రం హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు స్వామిజీలు, మరో వ్యక్తి కలిసి టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి మొదట ముగ్గురు ఎమ్మెల్యేలు.. తర్వాత కాసేపటికి మరో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పోలీసులు ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తమకు తాముగా ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు. తాను పార్టీ లైన్‌లోనే పని చేశానని, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉండబోతున్నదని, మరికొన్ని రికార్డింగులు బయటకు వస్తాయని ఫేస్‌బుక్‌లో వరుసగా రెండు రోజులు రేగా కాంతారావు పోస్టింగులు పెట్టారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలోనూ
టచ్‌లోకి రాలేదు. గువ్వల బాలరాజుతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకరు ఫోన్‌లో మాట్లాడిన రికార్డింగ్ రెండు, మూడు రోజులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
మునుగోడు ఫలితాన్ని బట్టి..
మునుగోడు ఉప ఎన్నికలో తమకు కేటాయించిన గ్రామాల వైపు నలుగురు ఎమ్మెల్యేలు కన్నెత్తి చూడలేదు. తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లలేదు. కుటుంబ సభ్యులు, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ వివాదం కోర్టు్ల్లో పెండింగ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు ఎమ్మెల్యేలు బయటికి వెళ్లి.. తమ అనుచరులతోనో, మీడియా ముందో వేర్వేరుగా మాట్లాడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే వారిని ప్రగతి భవన్ దాటనివ్వడం లేదని తెలుస్తోంది. వారికి కేటాయించిన నాలుగు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ప్రగతి భవన్‌లోనే ఉన్నాయి. ఆదివారం మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. ఈ రిజల్ట్ సానుకూలంగా వస్తే నలుగురు ఎమ్మెల్యేలను బయటికి పంపే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వస్తే మాత్రం వారికి ఇప్పట్లో విడుదల ఉందని టీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు.