ఏంటీ దారుణం : ఫోన్లో నర్సుల ట్రీట్మెంట్.. పెబ్బేరులో 4 నెలల గర్భిణి మృతి

ఏంటీ దారుణం : ఫోన్లో నర్సుల ట్రీట్మెంట్.. పెబ్బేరులో 4 నెలల గర్భిణి మృతి
  •   అందుబాటులో లేని డాక్టర్​
  •  అయినా ఆయన మెసేజ్​లతో చికిత్స       
  • గర్భసంచి బ్లాస్ట్​ కావడంతో మృతి 
  • వనపర్తి జిల్లాలో దారుణం 

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులో డాక్టర్, నర్సుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు నెలల గర్భిణి కన్నుమూసింది. బాధితులు, శ్రీరంగాపూర్​ మండలం నాగసానిపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం...గ్రామానికి చెందిన సరిత అలియాస్​ పుష్పలత(22)కు 8 నెలల క్రితం చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన ఎల్లస్వామితో పెండ్లయ్యింది. ప్రస్తుతం 4 నెలల గర్భిణి.. దీంతో సరిత పుట్టింటికి వెళ్లింది.

శనివారం రాత్రి వాంతులతో పాటు కడుపులో నొప్పి వస్తోందని పెబ్బేరులోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకువెళ్లారు.  డాక్టర్ ​అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్​ చేసుకున్నారు. డాక్టర్​తో ఫోన్​లో మాట్లాడి తే ఆయన మెసేజ్​లు పంపించగా ట్రీట్​మెంట్​ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు పేషెంట్​పరిస్థితి విషమంగా ఉందని నర్సులు డాక్టర్​కు సమాచారం ఇవ్వగా వెంటనే వచ్చిన డాక్టర్​సరితను కర్నూలు తీసుకువెళ్లాలని కోరాడు.

దీంతో కుటుంబసభ్యులు ప్రైవేటు అంబులెన్స్​లో కర్నూలు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కడుపులో రెండు గర్భసంచులు ఉండడంతో, అందులో ఒకటి బ్లాస్ట్​అయి గర్భిణి మృతి చెందిందని చెప్పారని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ఆగ్రహంతో పెబ్బేరులోని ప్రైవేటు దవాఖాన వద్దకు చేరుకొని ఆందోళన చేయాలని చూడగా పోలీసులు అడ్డుకున్నారు. 

మృతదేహాన్ని పట్టణంలోకి రానివ్వకుండా బైపాస్​వద్ద ఆపారు. అక్కడ ట్రాఫిక్​ జామ్​ అవుతోందని అంబులెన్సును పీజేపీ క్యాంపులో ఉంచారు. తర్వాత 
బాధితురాలి బంధువులు, గ్రామస్తులు పెబ్బేరు పీఎస్​లో హాస్పిటల్​యాజమాన్యంతో పంచాయితీ నిర్వహించారని తెలిసింది. ఈ విషయమై ఎస్సై హరిప్రసాద్​ రెడ్డిని వివరణ కోరగా ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, శ్రీరంగాపూర్​ స్టేషన్​లో కేసు నమోదు కావచ్చని చెప్పారు.