ఇండోర్(మధ్యప్రదేశ్): నాలుగు నెలల క్రితం.. ఇండోర్ లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో అతి దారుణంగా అశ్లీల చర్యలతో కూడిన ర్యాగింగ్ జరిగిందని, చర్యలు తీసుకోవాలంటూ యూజీసీ హెల్ప్ లైన్ కు ఓ స్టూడెంట్ నుంచి కంప్లయింట్ వచ్చింది. యూజీసీ ఆదేశాల మేరకు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ విభాగం కేసును ఫైల్ చేసింది. పోలీసులు క్యాంపస్ కు వచ్చి ఎంక్వైరీ చేశారు. కానీ.. వేధింపులు తప్పవన్న భయంతో స్టూడెంట్లు ఎవరూ నోరువిప్పలేదు. దీంతో అసలు కాలేజీలో ర్యాగింగ్ జరిగిందా? లేదా? జరిగితే ఎవరు చేశారు? అన్నవి చిక్కుప్రశ్నలుగా మిగిలిపోయాయి.
కంప్లయింట్ ఇచ్చిన స్టూడెంట్ వివరాలను ఇచ్చేందుకూ యూజీసీ నిరాకరించింది. ఇక లాభం లేదనుకున్న ఇండోర్ లోని సంయోగితా గంజ్ స్టేషన్ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ లో భాగంగా శాలిని చౌహాన్ (24) అనే కానిస్టేబుల్ స్టూడెంట్ అవతారం ఎత్తింది. మరో కానిస్టేబుల్ నర్సుగా మారింది. ఇంకో ఇద్దరు కానిస్టేబుల్స్ క్యాంటీన్ వర్కర్లుగా వెళ్లారు. మూడు నెలల పాటు తోటి కానిస్టేబుల్స్ తో కలిసి అండర్ కవర్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన శాలిని.. చివరకు నిందితులను కనిపెట్టి, కేసును సాల్వ్ చేసింది.
ఆపరేషన్ ఇలా జరిగింది..
స్టూడెంట్ మాదిరిగానే డ్రెస్ వేసుకుని, బుక్స్ బ్యాగ్ తో రోజూ కాలేజీకి వెళ్లిన శాలిని అక్కడి స్టూడెంట్లతో మాటలు కలిపింది. క్యాంటీన్ లో, క్యాంపస్ లో తిరుగుతూ వివరాలు సేకరించింది. తాను స్టూడెంట్ కాదన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. ఎవరైనా తన మెడికల్ కోర్స్ డీటైల్స్ అడిగితే.. చాకచక్యంగా టాపిక్ ను డైవర్ట్ చేస్తూ తనకు కావల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టింది.
ఇలా.. దాదాపుగా మూడు నెలలపాటు స్టూడెంట్ మాదిరిగా వెళ్తూ కేసులోని చిక్కు ప్రశ్నలకు సమాధానాలను కొనుగొన్నది. జులై 24న ర్యాగింగ్ జరిగింది నిజమేనని, మొత్తం 11 మంది సీనియర్ స్టూడెంట్లు ర్యాగింగ్ చేసినట్లు ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది. దీంతో ఆ స్టూడెంట్లను కాలేజీ నుంచి, హాస్టల్ నుంచి మూడు నెలల పాటు మేనేజ్ మెంట్ ఇటీవల సస్పెండ్ చేసింది. పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి, విచారణకు రావాలని ఆదేశించారు.