వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన బురాన్ పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య కేసులో పోలీసులు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఖమ్మం జైలులో ఉన్న నిందితుడు పల్లె మురళిని కలవడానికి వెళ్తుండగా.. పక్కా సమాచారం మేరకు రాయపర్తి గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వర్ధన్నపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. సూదుల దేవేందర్ ను హత్య చేయడానికి పల్లె మల్లేశ్, అతని కుమారుడు పల్లె మురళి హైదరాబాద్ కు చెందిన సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్ణోల్ల కృష్ణయ్య, గోవింద్, చెన్న రాయుడుతో రూ.30 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్లు తిరిగేందుకు ఒక కారుకు రూ.3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
పథకం ప్రకారం పల్లె మల్లేశ్, పల్లె మురళి, సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్ణోల్ల కృష్ణయ్య, గోవింద్, చెన్న రాయుడు జులై 7న సూదుల దేవేందర్ ను అతని ఇంట్లోనే హత్య చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముందుగా పల్లె మల్లేశం, చెన్న రాయుడు. గోవింద్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు పల్లె మురళిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్ణోల్ల కృష్ణయ్య, పల్లె ముకేశ్‌ను అరెస్ట్ చేశారు. సుంకర ప్రసాద్ గ్యాంగ్ కు పల్లె మురళి ఇప్పటి వరకు రూ.14 లక్షలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. సుంకర ప్రసాద్ పై 3 హత్య కేసులు, 10 నకిలీ నక్సలైట్ కేసులు, 2 కిడ్నాప్ కేసులు, 10 దొంగతనం కేసులు ఉండగా, మార్నేని రాజుపై 3 హత్య కేసులు, 70 దొంగతనం కేసులున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. సమావేశంలో సీఐ సూర్య ప్రకాశ్, ఎస్ఐలు ప్రవీణ్, రాజు, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.