
- అరెస్ట్ అయినవారిలో కొత్తపల్లి జడ్పీటీసీ భర్త పిట్టల రవీందర్, 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాశ్, మరో ఇద్దరు..
- వేర్వేరు ఘటనల్లో మాజీ తహసీల్దార్ సహా 13 మందిపై కేసు
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ కమినరేట్ పరిధిలోని భూకబ్జా కేసుల్లో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. భూకబ్జా కేసుల్లో ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పలువురు అరెస్ట్ కాగా మంగళవారం మరో నలుగురిని అరెస్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వీరితో సహా 13 మందిపై కేసు నమోదు చేశారు. మంగళవారం అరెస్ట్ అయిన వారిలో కొత్తపల్లి జడ్పీటీసీ భర్త పిట్టల రవీందర్, 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాశ్, రౌడీషీటర్ తిరుపతి విష్ణువర్దన్, మంద నగేశ్ ఉన్నారు. వీరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్‌కు చెందిన పామ్‌రాజ్ దేవిదాస్ రావు తండ్రి పామ్రాజ్ గోవిందరావుకు 1954లో చింతకుంట శివారులో 5.08ఎకరాలు ఉండేది. ఈ భూమిని ఇతరులకు అమ్ముకోగా 20 గుంటలు మిగిలింది. ఈ భూమి ధరణిలో పామ్రాజ్ గోవిందరావు పేరు మీద ఉండగా పహణీలో మాత్రం న్యాలమడుగు చిన్నవీరయ్య పేరు వచ్చింది. గుర్తించిన అప్పటి సర్పంచ్, కొత్తపల్లి జడ్పీటీసి భర్త పిట్టల రవీందర్ ఆ భూమిని కాజేయాలని వీరయ్య పేరుగల మరో వ్యక్తి కుమారుడు రాజయ్య పేరుపై అప్పటి తహసీల్దార్ మోహన్ రెడ్డితో కలిసి తప్పుడు విరాసత్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాడు.
అనంతరం 2009లో గడ్డం ఆదిరెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత 2010లో పిట్టల రవీందర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఆ భూమి తనదేనని, ఇంకోసారి వస్తే చంపేస్తానని బెదిరించాడని బాధితుడు పామ్రాజ్ దేవిదాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి తహసీల్దార్ మోహన్ రెడ్డి, పిట్టల రవీందర్, గడ్డం ఆదిరెడ్డి, న్యాలమడుగు రాజయ్యపై కేసు నమోదు చేశారు. మంగళవారం పిట్టల రవీందర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.
మరో కేసులో..
తప్పుడు పత్రాలతో ఒకే భూమిని పలువురికి అమ్మి మోసం చేయడంపై 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాశ్‌తోపాటు మరో నలుగురుపై కేసు నమోదైంది. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంకు చెందిన వంతడపుల సంపత్.. 1998లో తొమ్ముడ్రు నర్సింహారావు వద్ద వల్లంపహాడ్‌లో 33 గుంటలు కొని, ప్లాట్లుగా చేసి అమ్మాడు. నరసింహారావు ఇతరులకు అమ్మిన భూమిని అక్రమంగా విక్రయ దస్తావేజుపై రిజిస్ట్రేషన్ చేయించుకుని, తిరిగి ఆ భూమిని కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన అబ్దుల్ హఫీజ్ కు అమ్మాడు.
హఫీజ్ అందులో నుంచి 10 గుంటలను 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాశ్ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. మరో 3గుంటలను కట్టరాంపూర్ కు చెందిన ఉప్పు సురేశ్, వావిలాలపల్లికి చెందిన కట్ట రమ్యలకు అమ్మాడు. తన భూమిపైకి వెళ్లనివ్వకుండా పై ఐదుగురు బెదిరిస్తున్నారని బాధితుడు సంపత్ ఇచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టి వారిపై కేసు నమోదు చేశారు. ఆకుల ప్రకాశ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
చొప్పదండి మండలంలో..
చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన పంబాల శ్రీనివాస్ కార్తికేయనగర్ లో గట్టు లక్ష్మి పేరిట ఉన్న సర్వే నంబర్ 233/E లోని ప్లాట్ నెంబర్ 120/Aలో 200 చదరపు గజాలు కొన్నాడు. 2022లో మున్సిపాలిటీ ద్వారా అనుమతి పొంది ఈ ప్లాటులో ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. సిటీలోని కాపువాడకు చెందిన తిరుపతి విష్ణువర్ధన్, మంద నగేష్ , తీగలగుట్టపల్లికి చెందిన కొమ్ము భూమయ్య, నితిన్‌వర్ధన్ వచ్చి ఈ స్థలం తమదంటూ శ్రీనివాస్‌ను బెదిరించారు. గతంలో ఈ భూమి యజమాని బద్రుద్దీన్ దని, వారి నుంచి మంద నగేశ్ కు సాదాబైనామా ద్వారా కొన్నట్లు నకిలీ విక్రయ పత్రం చూపించారు.
ఈ భూమి కావాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ భూమి దక్కకుండా చేసి చంపేస్తామని శ్రీనివాస్‌ను బెదిరించారు. దీంతో బాధితుడు శ్రీనివాస్ వారికి మొత్తంగా రూ.5 లక్షలు ఇచ్చాడు. అయినప్పటికీ ఇబ్బందులకు గురిచేయడంతో శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రూరల్ సీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి తిరుపతి విష్ణువర్ధన్, కొమ్ము భూమయ్య, మంద నగేశ్, తిరుపతి నితిన్‌వర్ధన్ లపై కేసు నమోదు చేసి విష్ణువర్ధన్, మంద నగేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి14 రోజుల రిమాండు విధించింది.