
ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వారు అగ్నిపథ్ స్కీమ్ లో మారిన రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. భారతీయ సైన్యంలో ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 13న అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ (ARO) లాన్స్‌డౌన్ డైరెక్టర్ కల్నల్ పరితోష్ మిశ్రా అగ్నివీర్ స్కీం లో మారిన కొత్త రూల్స్ గురించి చెప్పారు. వాటిని తెలుసుకోండి. అప్లికేషన్ చివరి తేది మార్చి 22. అగ్నివీర్ పథకం కింద ఇండియన్ ఆర్మీలోకి మహిళా ఆర్మీ పోలీస్, హవల్దార్, సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్, కానిస్టేబుల్ ఫార్మా, నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు సైన్యంలో తాత్కాలికంగా 4 ఏళ్లపాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది.
అడాప్టబిలిటీ టెస్ట్
సైన్యంలో చేరే యువత బార్డర్ లో అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. దీని కోసం అతి కష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని పని చేయగలరా? లేదా? అని కొత్తగా అడాప్టబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ నియామకాల నుంచే ఈ టెస్ట్ అమలులోకి రానుంది. ఇది మెడికల్ టెస్ట్ కంటే ముందే అభ్యర్థులకు అడాప్టబిలిటీ టెస్ట్ చేస్తారు. ఇందులో పాస్ అవుతేనే నెక్ట్స్ రౌండ్ కు పంపిస్తారు.
వీరికి టైపింగ్ టెస్ట్
అగ్నివీర్ క్లర్క్ పోస్టులను ఆఫీస్ అసిస్టెంట్ గా పేరు మార్చారు. ఈ పోస్టులకు పోటీ పడే వారికి కొత్తగా టైపింగ్ టెస్ట్ కూడా పెడతారు. ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్‌ల స్థాయిలు అభ్యర్థుల వయస్సు, సామర్థ్యాన్ని బట్టి సెట్ చేస్తారు.
ఇకనుంచి ఐరిస్ స్కాన్
ఒకరి బదులు మరొకరు రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని మోసాలకు పాల్పడకుండా ఈసారి నుంచి అభ్యర్థులకు ఐరిస్ స్కాన్ చేయనున్నారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఈ రిక్రూట్మెంట్లోనే మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ర్యాలీలో అభ్యర్థుల ఆధార్‌ను వెరిఫై చేస్తారు. అందుకే అభ్యర్థులు కచ్చితంగా తమ ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్లను మాత్రమే వాడి అప్లికేషన్ చేసుకోవాలి. సొంత మెయిల్ ఐడీలనే దరఖాస్తులో సమర్పించాలి.
వారికి కూడా టెక్నికల్ పోస్టుల్లో అవకాశం
గతంలో ఐఐటీ చేసిన వారికి మాత్రమే టెక్నికల్ రిక్రూట్మెంట్కు ఎలిజిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు పాలిటెక్నిక్ అభ్యర్థులకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. దీంతో పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా అగ్నివీర్ పోస్టుల్లో టెక్నికల్ పోస్టులకు కోసం అప్లై చేసుకోవచ్చు.