
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ఏప్రిల్ 4 సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బీజేపీ తరపున గౌతం రావు , ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం నలుగురు నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీకి నామినేషన్ వేయలేదు. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనుకున్న సమయంలో బీజేపీ పోటీకి దిగింది. బీజేపీ నామినేషన్ వేయడంతో ఎమ్మెల్సీ పోలింగ్ అనివార్యమైంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా..25న కౌంటింగ్ జరగనుంది.
మరోసారి తనకు అవకాశం ఇచ్చిన ఎంఐఎం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్. ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషకరమన్నారు. బీజేపీ నామమాత్రంగా పోటీలో ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎందే విజయమని చెప్పారు.
►ALSO READ | ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇంకెన్నాళ్లు.. స్థానికుల ఆందోళన
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ తరుపున నామినేషన్ దాఖలు చేశానన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతం రావు. అందరు సభ్యులు పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేయాలని కోరారు. ఎంఐఎంకి వ్యతిరేకంగా బీజేపీ పోటీలో ఉంటుందన్నారు. ఎంఐఎం దురాగతాలకు వ్యతిరేకంగా బీజేపీని బలపర్చాలని కోరారు.