హర్యానాలోని రోహ్‌తక్ నుండి ఢిల్లీ ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సంప్లా రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పేలుడు తరువాత మంటలు ఒక బోగీ నుంచి మరొక బోగీకి వ్యాపించాయి. సకాలంలో సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.
సోమవారం సాయంత్రం 4:20 గంటల సమయంలో రైలు రోహ్‌తక్ స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే, ఈ పేలుడు సంభవించింది. ఉన్నట్టుండి కోచ్‌ను దట్టమైన పొగలు కమ్మేయడంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ల నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పేలుడు సమాచారం అందిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రైలు చాలా సేపు ట్రాక్‌పై నిలిచిపోయింది. విచారణ అనంతరం రైలును ఢిల్లీకి అనుమతించారు.
పేలుడు కారణాలు
రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెద్ద మొత్తంలో సల్ఫర్, పొటాష్‌ను తీసుకెళ్తుండగా ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫుటేజీలో కోచ్‌లో పొగలు కమ్ముకోవడం, సీట్లు మంటల్లో చిక్కుకోవడం చూడవచ్చు.