సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని రైతులకు టోకరా .. మహమ్మదాబాద్​ పీఎస్‌కి క్యూ కట్టిన రైతులు

సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని రైతులకు టోకరా .. మహమ్మదాబాద్​ పీఎస్‌కి క్యూ కట్టిన  రైతులు
  • డెయిరీ, ఫౌల్ట్రీ ఫారాలకు నాబార్డు ద్వారా రుణాలు ఇప్పిస్తామని మోసం
  • ఒక్కో రైతు నుంచి రూ.50 వేల వరకు వసూలు
  • ఒరిజినల్​ డాక్యుమెంట్లు తీసుకొని పత్తాలేని కేటుగాళ్లు
  • మహమ్మదాబాద్​ పోలీస్​ స్టేషన్​లో పలువురు రైతుల ఫిర్యాదు

మహబూబ్​నగర్​/గండీడ్​, వెలుగు : రైతులకు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని నలుగురు వ్యక్తులు రైతులను మోసం చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించకపోగా.. వారి నుంచి డబ్బులు తీసుకొని వాటిని తిరిగి ఇవ్వడం లేదు. రైతులకు చెందిన ఒరిజినల్​ డాక్యుమెంట్లను తీసుకుని ఇబ్బందులు గురి చేస్తుండటంతో పోలీసులకు  కంప్లైంట్​ చేశారు. 

బ్యాంక్​ ఎంప్లాయిస్​ అని నమ్మించి..

మహబూబ్​నగర్​ జిల్లా ఉమ్మడి గండీడ్​ మండలం బల్సూర్​గుండ గ్రామానికి చెందిన గొల్ల రాములుకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మహేందర్​ అనే వ్యక్తితో పరిచయం ఉంది. మహేందర్​ గతంలో కో ఆపరేటివ్​ బ్యాంక్​లో ఉద్యోగం చేస్తూ.. సస్పెండ్ అయ్యాడు. ఈయనకు హైదరాబాద్​కు చెందిన ఓ బ్యాంకు దళారి కొండల్​ స్వామితో పరిచయం ఏర్పడింది. దీంతో గొల్ల రాములు ఏడాదిన్నర కిందట వీరి ద్వారా తనకు పరిచయం ఉన్న రైతులకు డెయిరీ, ఫౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు నాబార్డు ద్వారా 50 శాతం సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పాడు. 

 డెయిరీ ఏర్పాటుకు రూ. 20 లక్షల నుంచి రూ.26 లక్షలు, ఫౌల్ర్టీ ఫారాలకు రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించారు.  ముగ్గురు వ్యక్తులు సాంబయ్య అనే వ్యక్తిని రైతుల వద్దకు తీసుకొచ్చి.. సినీ నిర్మాతగా పరిచయం చేశారు.  ఈయన ష్యూరిటీ ద్వారా రుణాలు ఇప్పిస్తున్నట్లు నమ్మించారు.  రైతుల పొలాల వద్ద పరిశీలించి డాక్యుమెంటేషన్​ కోసం.  ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.60 వేల వసూలు చేశారు.

డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బందులు

వ్యవసాయ భూములను నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్​ కింద మార్చేందుకు రూ.10 వేల నుంచి రూ.14 వేలు, రిజిస్ర్టేషన్​ డాక్యుమెంట్​ కోసం రూ.వెయ్యి, ఇంజనీరింగ్​ ప్లానింగ్​ కోసం రూ. 6,500, ప్రాజెక్టు రిపోర్టు కోసం రూ.6 వేలు, లాగిన్ ఫీ కింద రూ.15 వేలు, షెడ్​ పర్మిషన్​ కోసం ఎస్​బీఐలో చలాన్​ కోసం రూ.11,500 ఒక్కో రైతు ఖర్చు చేశాడు. ​ఈ డాక్యుమెంట్లను మొత్తం ఫైల్​ చేసి సదరు వ్యక్తులకు అప్పగించారు. కొద్ది రోజుల కిందట పలువురు రైతులకు ఫోన్​ చేసి మీకు లోన్​ అప్రూవల్​ అయ్యిందని మహబూబ్​నగర్​కు రావాల్సిందిగా చెప్పారు.  

మహబూబ్​నగర్​కు వెళ్లిన రైతులకు రెండు రోజుల్లో అప్రూవల్​ లెటర్​ వస్తుందని..  ఇందుకు కొంత ఖర్చు అవుతుందని వారి నుంచి డబ్బులు తీసుకున్నారు.  తీరా ఇప్పటి వరకు వారికి రుణాలు మంజూరు కాలేదు.  దీంతో మోసపోయామని రైతులు రెండు రోజుల కిందట పోలీసులను ఆశ్రయించారు.  కొందరు రైతులు బయటపడితే మోసపోయి పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలిసింది. ఈ విషయంపై కొండల్​ స్వామిని 'వెలుగు' వివరణ కోరగా..  నేను ఎవరికి లోన్​ ఇప్పిస్తానని చెప్పలేదని అన్నారు. 

 వాళ్లు ఎవరికి ఇచ్చారో వారితో మాట్లాడుకోవాలని సమాధానం ఇచ్చారు.  గొల్ల రాములును వివరణ కోరగా.. 'మహేందర్​ అనే వ్యక్తి ప్రైవేట్​గా లోన్​లు ఇప్పిస్తారని తెలిసి, అందరం కలిసి మాట్లాడే లోన్​ల కోసం ప్రయత్నం చేశాం. మొదట్లో లోన్​లు వస్తాయని చెప్పారు. ఇప్పుడు రావని చెబుతున్నారు. కొందరి రైతుల పేపర్లు పోయాయని తొండి చేస్తున్నారు.  మేం ఆ డాక్యుమెంట్లతో ఎలాంటి పట్టా చేసుకోలేదు,  రుణాలు తీసుకోలేదు. వాళ్లకు ఫోన్​ పేల ద్వారా డబ్బులు వేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పాం అని సమాధానం ఇచ్చారు.

ఇండ్లు కూల్చి షెడ్​ కట్టిన

నాకు కొంత భూమి ఉంది. డెయిరీ ఏర్పాటుకు రూ.26 లక్షల లోన్​ ఇప్పిస్తామని చెప్పారు. లోన్​ శాంక్షన్ కావాలంటే రోడ్డు కూడా వేయాలన్నారు. దీంతో నా పొలం వరకు రోడ్డు వేసుకున్నాను.  షెడ్​ నిర్మాణం కోసం నా పొలంలో ఉన్న రెండు ఇండ్లను కూల్చేసిన. పశువులకు మేత కోసం ఎకరం పొలంలో పశుగ్రాసం సాగు చేసిన. ఏడాదిన్నర కావస్తున్నా ఇంత వరకు లోన్​ మంజూరు చేయలేదు. లోన్​ కోసం ఇచ్చిన ఒరిజినల్​ డాక్యుమెంట్లు నాకు తిరిగి ఇవ్వడం లేదు.  బామ్లా నాయక్​, బాధిత రైతు, బల్సూర్​గుండ, మహమ్మదాబాద్​ మండలం