
- రూ. 1.03 లక్షలు పోగొట్టుకున్న నలుగురు వ్యక్తులు
సిద్దిపేట, వెలుగు: సైబర్ నేరగాళ్ల మాయలో పడి నలుగురు వ్యక్తులు రూ. 1.03 లక్షలు పోగొట్టుకున్నారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి పాన్ కార్డ్ అప్డేట్ చేయాలని ఒక లింకు పంపించారు. దాన్ని ఓపెన్ చేసి వివరాలు ఎంటర్చేయగానే అతడి అకౌంట్లో నుంచి రూ.12,500 డెబిట్ అయ్యాయి. భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మహిళకు గుర్తు తెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నామని మీ ఇండస్ ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి మొబైల్కు వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పాలన్నారు.
సదరు మహిళ అతడు చెప్పిన మాటలు నమ్మి ఓటీపీ నెంబర్ చెప్పింది. అంతే ఆమె అకౌంట్లో నుంచి రూ.22,557 డెబిట్ అయ్యాయి. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మహిళ మైంట్రా యాప్ లో ఒక షర్ట్ ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేసింది. తర్వాత మైంట్రా యాప్ నుంచి మాట్లాడుతున్నామని ఒక సైబర్ నేరగాడు ఫోన్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాము మీరు పంపిన డబ్బులు రావాలంటే తాము పంపే లింకు ఓపెన్ చేయాలని సూచించాడు.
ఆ మహిళ లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్లో నుంచి రూ.56,360 డెబిట్ అయ్యాయి. చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి కెవైసీ అప్డేట్ చేసుకోమని వాట్సప్ కు ఒక మెసేజ్ రాగానే ఆ లింకును ఓపెన్ చేశాడు. వెంటనే అకౌంట్లో నుంచి రూ.13,400/- డెబిట్ అయ్యాయి. మోసపోయామని భావించిన నలుగురు వెంటనే సైబర్ సెల్ జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సైబర్ మోసగాళ్ల తో జాగ్రత్తగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింక్ లు ఓపెన్ చేయవద్దని సీపీశ్వేత సూచించారు.