- బీఆర్ఎస్నుంచి ఇద్దరు..కాంగ్రెస్‌నుంచి మరో ఇద్దరు
- స్టాండింగ్కమిటీ ఎన్నికల్లో ఆసక్తి పర్వం
- పోటీపై స్పష్టత ఇవ్వని పార్టీల పెద్దలు
- 15 నామినేషన్లు దాటితే ఎన్నికలు
- కాంగ్రెస్‌తో ఎంఐఎం దోస్తీ!
హైదరాబాద్ సిటీ, వెలుగు : స్టాండింగ్కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఏ పార్టీ పూర్తిగా నిర్ణయం తీసుకోకముందే మంగళవారం రెండు పార్టీల నుంచి నలుగురు కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. నామినేషన్లకు మొదటి రోజైన సోమవారం ఒక్క నామినేషన్రాకపోగా, రెండో రోజైన మంగళవారం నాలుగు నామినేషన్లు వచ్చాయి. ఇందులో బీఆర్ఎస్నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌నుంచి హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, రాంచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప, బీఆర్ఎస్ నుంచి అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి, కూకట్ పల్లి కార్పొరేటర్ సత్యనారాయణరావు నామినేషన్లు దాఖలు వేశారు. నామినేషన్లకు చివరి తేదీ 17వ తేదీ కాగా, 18న పరిశీలన ఉంటుంది. 21 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. తర్వాత పోటీలో ఉండే వారి ఫైనల్ లిస్ట్ప్రకటిస్తారు.
నేడు క్లారిటీ వచ్చే ఛాన్స్
స్టాండింగ్కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఇంకా నిర్ణయానికి రాలేదు. ఇప్పటికే ఆయా పార్టీల పెద్దలతో కార్పొరేటర్లు సమావేశమైనా ఎవరు పోటీ ఉండాలన్నదానిపై స్పష్టత రాలేదు. దీంతో బుధవారం బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీల పెద్దలతో మరోసారి సమావేశం కానున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో ఆ పార్టీ కార్పొరేటర్లు, మాజీ మంత్రి, ససత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు బుధవారం సమావేశం కానున్నారు. గతంలో మాదిరిగానే ఎంఐఎం నుంచి ఏడుగురు నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది.
ఈసారి రసవత్తరం..
గ్రేటర్ లో 150 మంది కార్పొరేటర్లుండగా ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా మొత్తం సంఖ్య146కు చేరింది. ఇందులో బీజేపీకి 39 మంది, బీఆర్ఎస్ కు 42, కాంగ్రెస్ కు 24, ఎంఐఎంకు 41 మంది కార్పొరేటర్ల బలం ఉంది.15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలంటే 74 మంది కార్పొరేటర్ల మద్దతు కావాలి. ఒక సభ్యుడు 15 మందికి మాత్రమే ఓటు వేయొచ్చు. కాంగ్రెస్‌కు ఎంఐఎం సపోర్టు చేసే అవకాశమున్నప్పటికీ వీరి బలం 65 దగ్గరే ఆగిపోతోంది.
బీజేపీ, బీఆర్ఎస్కలిస్తే స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకపక్షమయ్యే అవకాశం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలవబోమని ఆ పార్టీ చెప్తోంది. ఈ సందిగ్ధత ఇలాగే కొనసాగితే కొందరు పార్టీ మారే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీల బలాబలాలు మారి ఎన్నిక రసవత్తరంగా మారే ఛాన్స్ఉంది.
నేనంటే నేనంటున్న కార్పొరేటర్లు
స్టాండింగ్కమిటీ కోసం వేసే నామినేషన్ల సంఖ్య 15 వరకు ఉంటే ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నంబర్దాటితే ఎన్నిక అనివార్యం కానున్నది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతిపార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నలుగురు నామినేషన్లు వేయగా, ఎంఐఎం కార్పొరేటర్లు కూడా రెండు రోజుల్లో నామినేషన్లు వేయనున్నారు. బీజేపీ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. మెజారిటీ లేకపోయినా ప్రతి పార్టీ నుంచి పోటీలో ఉండాలని కార్పొరేటర్లు తహతహలాడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యలో ఏక్రగ్రీవం కావడం కష్టమనే చెప్పొచ్చు.