భద్రాద్రి జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి

భద్రాద్రి జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి
  • భద్రాద్రి జిల్లాలో ఇద్దరు యువతులు  చనిపోగా.. మరో ముగ్గురు మహిళలకు గాయాలు 

దమ్మపేట, వెలుగు : పిడుగుపాటుతో ఇద్దరు యువతులు మృతి చెందగా.. మరో ముగ్గురు మహిళలు  తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు  మంగళవారం స్థానిక రైతు పొలంలో కూలి పనులకు వెళ్లారు. 

మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతుండగా.. ఇంటికి వెళ్లేందుకు కూలీలు ఆటో కోసం చెట్టుకింద ఎదురు చూస్తున్నారు. ఆ చెట్టుపై పిడుగుపడటంతో సున్నం అనూష(23), కట్టం నాగశ్రీ (23) అక్కడికక్కడే చనిపోయారు. రాజమ్మ, సీతమ్మ, రత్తమ్మకు గాయాలవడంతో సత్తుపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో సీతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. అనూష డిగ్రీ, నాగశ్రీ టెన్త్ చదివారు.

 ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేక తల్లిదండ్రులకు సాయంగా ఇద్దరు యువతులు కూలి పనులు వెళ్తున్నారు. యువతుల మృతితో ఆయా కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతి చెందిన యువతుల కుటుంబాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుభూతి తెలిపారు. గాయపడ్డ మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మహబూబాబాద్ జిల్లాలో రైతు..

కొత్తగూడ : పిడుగు పాటుతో రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కొత్తగూడ మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మయ్య(65) మంగళవారం ఉదయం మొక్కజొన్న చేను వద్దకు వెళ్లాడు. ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం పడడంతో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో ఒకసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే లక్ష్మయ్య మృతి చెందాడు. పక్క చేను రైతు సల్లూరి సాంబయ్య అస్వస్థతకు గురై కాసేపటికి తేరుకుని ఇంటికి వెళ్లి చెప్పాడు. మృతుడికి భార్య ఎల్లమ్మ, పెండ్లైన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

కరీంనగర్‌‌ జిల్లాలో పశువుల కాపరి..

హుజూరాబాద్ రూరల్ : కరీంనగర్‌‌ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేటకు చెందిన పశువుల కాపరి కంకణాల కృష్ణకుమార్(30)  పిడుగుపాటుతో మృతిచెందాడు. పశువులను మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లగా ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి కృష్ణకుమార్‌‌కు సమీపంలో పిడుగు పడింది. దీంతో ఆయన స్పాట్‌లోనే చనిపోయాడు.  

పశువులు మేత మేసి సాయంత్రం ఇంటికి వెళ్లగా.. ఎంతకూ కృష్ణ కుమార్ రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య మౌనిక, తండ్రి సమ్మయ్య వెళ్లి చూడగా కృష్ణకుమార్ కాలిన గాయాలతో చనిపోయి కనిపించాడు. మృతుడికి ఆరేండ్ల కొడుకు ఉన్నాడు. గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా చేశారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.