కరెంట్​షాక్​తో.. వేర్వేరు చోట్ల నలుగురు మృతి

 
  • కరెంట్​షాక్​తో వేర్వేరు చోట్ల నలుగురు మృతి
  • సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడేకన్నలో భార్యాభర్తలు
  • నిజామాబాద్​ జిల్లా భిక్కనూరులో ఏడాదిన్నర బాలుడు..
  • మెదక్​ జిల్లా  రామాయంపేటలో రైతు..

ఝరాసంగం, వెలుగు :  సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడేకన్న గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి భార్యాభర్తలు  చనిపోయారు.  గ్రామానికి చెందిన దంపతులు ముక్కనగారి దేవదాస్ (34), మరియమ్మ (32) తమ వ్యవసాయ పొలంలో పనులు చేసేందుకు వెళ్లారు.  చెరుకు పంటలో గడ్డి మందు జల్లుతుండగా,  అప్పటికే చెరుకు పంటను కాపాడుకోవడానికి వేసిన కరెంట్​ వైర్లను గమనించలేదు.  ప్రమాదవశాత్తు ఆ కరెంట్​ వైరు మరియమ్మ కాలుకు తగిలి షాక్ తో కేకలు వేసింది. అక్కడే ఉండి గమనించిన భర్త ఆమెను కాపాడే క్రమంలో షాక్ కు గురై ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. వీరికి బాబు, పాప ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. మృతుడి తండ్రి పెంటయ్య ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపారు. 

తల్లికి ముప్పు తప్పి.. 

భిక్కనూరు, వెలుగు:  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని అంతంపల్లిలో కరెంట్​షాక్​తో 18నెలల బాలుడు చనిపోయాడు.  బండి ప్రవీణ్​–రమ్య  కొడుకు శీతిక్.    సోమవారం కూలీ పనికి వెళ్లిన రమ్య సాయంత్రం ఇంటికి వచ్చి ఆరేసిన బట్టలు తీస్తుండగా ఆమె దగ్గరికి బాలుడు వచ్చాడు.  కరెంట్​వైరు దండేనికి  తగలడంతో రమ్యకు షాక్​ వచ్చింది. ఇది గమనించిన ఇంటి పక్క వ్యక్తి వైరును కర్రతో కొట్టడంతో  రమ్యకు ప్రాణపాయం తప్పింది.  అదే వైరు శీతిక్​పై పడడంతో కింద పడిపోయాడు.   వెంటనే కామారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు బాలుడు అప్పటికే చనిపోయాడని తెలిపారు.

స్టార్టర్​ వద్ద పనిచేస్తూ.. 

రామాయంపేట, వెలుగు:    మెదక్​ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ లో  మంగళవారం కరెంట్​ షాక్​ తో  ఓ రైతు చనిపోయాడు.  గ్రామానికి చెందిన ఇబ్రహీం (30) అనే రైతు  తన పొలం వద్ద బోరు మోటర్​కు సంబంధించిన స్టార్టర్ డబ్బా​ వద్ద పని చేస్తుండగా షాక్​ కొట్టి స్పాట్​లోనే మృతి చెందాడు.  ఈ మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.