- పక్కింట్లో గొడవ ఆపబోయి.. వృద్ధురాలు మృతి
- మద్యం మత్తులో తమ్ముడిని కొట్టిచంపిన అన్న
- భార్యాభర్తల గొడవలో భర్త.. మరో ఘటనలో వృద్ధుడు మృతి
- రేప్ కేసులో బెయిల్ పై వచ్చి బాధితురాలి తండ్రి గొంతు కోసిన నిందితులు
- పగతో బావ గొంతు కోసిన మరో యువకుడు.. ఇద్దరి పరిస్థితి విషమం
గొడవలకు నాలుగు నిండు ప్రాణాలు బలయ్యాయి. పగ, ప్రతీకారాలకు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లిలో గీకురు నర్సయ్య(65) అనే వృద్ధుడిని సోమవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ప్లాస్టిక్ వస్తువులు, బీరు సీసాలు సేకరించే నర్సయ్యకు భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. బిడ్డలకు పెండ్లి కాగా, భార్య ఎల్లవ్వతో కలిసి ఉంటున్నాడు. నర్సయ్య రోజూ రాత్రికి తాగొచ్చి అందరినీ తిడుతూ భార్యతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా నర్సయ్య తాగి వచ్చి అందరినీ బూతులు తిట్టాడు. ఎల్లవ్వతోనూ గొడవ పెట్టుకున్నాడు. తర్వాత వరండాలో మంచంపై పడుకున్నాడు. మంగళవారం ఉదయం అతడు మంచంపైనే శవమయ్యాడు. పోలీసులు వచ్చి విచారించారు. రాత్రి తమ కుక్క మొరిగిందని, బయటికి వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదని.. తెల్లారి చూస్తే తన భర్త చనిపోయి ఉన్నాడని ఎల్లవ్వ చెప్పింది. అయితే, నర్సయ్య తల, నుదురు, కుడికన్నుపై గాయాలు కావడం.. ఇంటికి దగ్గర్లోని పొదల్లో రక్తం మరకలు ఉన్న గొడ్డలి దొరికడంతో దానితోనే నరికి చంపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
బావ గొంతు కోసి.. పరార్
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్కు చెందిన నీల స్వామికి కోమట్‌పల్లికి చెందిన సునీతతో కొన్నేండ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం భర్తతో గొడవ కారణంగా సునీత పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో బావపై కోపం పెంచుకున్న సునీత అన్న నవీన్ అతడిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. సోమవారం రాత్రి మెంగారంలోని కల్లు దుకాణంలో నీల స్వామితో నవీన్, సుధాకర్ కలిసి కల్లు తాగారు. తర్వాత కోమట్‌పల్లికి బయలుదేరారు. మెంగారం బస్టాండ్ వద్దకు రాగానే సుధాకర్, నవీన్ కత్తులతో నీలస్వామిపై దాడి చేసి గొంతు కోశారు. స్వామి గ్రామంలోకి పరుగెత్తుకెళ్లగా, నవీన్, సుధాకర్ పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ నీలస్వామిని పోలీసులు కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.
బెయిల్ పై వచ్చి గొంతు కోశారు
లైంగిక దాడి కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన నిందితులు తమపై ఫిర్యాదు చేశాడన్న కోపంతో బాధితురాలి తండ్రిపై దాడి చేసి గొంతు కోశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం రాఘవపల్లి గ్రామానికి చెందిన నార్ల నాగయ్య కూతురు వికలాంగురాలు. ఆమెపై గతంలో అదే గ్రామానికి చెందిన రమేశ్, శ్రీకాంత్, మల్లయ్య, శ్యాం లైంగిక దాడికి పాల్పడ్డారు. నాగయ్య ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. కోర్టులో ట్రయల్ నడుస్తోంది. నిందితులు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, నాగయ్యపై కక్ష పెంచుకున్న నిందితులు జూకంటి రమేశ్, శ్యాం కలిసి సాయిలు అనే వ్యక్తి సహాయంతో సోమవారం రాత్రి దాడి చేసి కత్తితో గొంతు కోశారు. రక్తం మడుగులో పడి ఉన్న నాగయ్యను పోలీసులు ఎల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. ఇతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
దంపతుల మధ్య గొడవ.. భర్త మృతి
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలో భార్యాభర్తల గొడవలో భర్త మృతి చెందాడు. మూసీ ఒడ్డు సింగారం గ్రామానికి చెందిన ఆరుట్ల చిరంజీవి (40), గుడుగుంట్లపాలేనికి చెందిన అరుణ 2009లో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి బిడ్డ, కొడుకు ఉన్నారు. భర్తకు ఉద్యోగం లేకపోవడంతో అరుణ.. బాలికల గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే, ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త స్కూల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. దీంతో ఆమెను జాబ్ నుంచి తీసేశారు. అరుణ మూడు నెలలుగా గుడుగుట్లపాలెంలోని పుట్టింట్లోనే ఉంటున్నది. రెండు రోజుల కిందట ఓ ప్రైవేట్ స్కూల్ లో అరుణ ఇంటర్వ్యూకు వెళ్లగా.. చిరంజీవి అక్కడకు కూడా వెళ్లి ఉద్యోగులతో గొడవపడటంతో ఆమెకు జాబ్ రాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి గుడుగుంట్లపాలేనికి వెళ్లిన చిరంజీవి అరుణతో గొడవపడి ఆమెపై కత్తితో దాడి చేశాడు. అరుణ కేకలు వేయడంతో బంధువులు వచ్చి చిరంజీవిని పట్టుకుని చితకబాదారు. స్పృహ తప్పిపడిపోయిన చిరంజీవిని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.
గొడవ ఆపబోయి.. వృద్ధురాలు మృతి
కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లిలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి తల్లిదండ్రులతో గొడవ పడుతుండగా అడ్డుకొవటానికి వెళ్లిన వ్యక్తులపైనా దాడి చేయటంతో ఓ వృద్ధురాలు చనిపోయింది. తిమ్మక్ పల్లికి చెందిన శేఖర్ కుటుంబ కలహాల వల్ల తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఇంటి పక్కనున్న వృద్ధురాలు లక్ష్మి(65), మరో ఇద్దరు వ్యక్తులు అడ్డుకోవటానికి వెళ్లారు. వీరిపై శేఖర్ ఇటుకలతో దాడి చేయడంతో లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ముందుగా కామారెడ్డికి, తర్వాత హైదరాబాద్ కు తరలిస్తుండగా చనిపోయింది. కాగా, శేఖర్ ఇటీవల మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు.
తప్పతాగి తమ్ముడిని కొట్టి చంపిండు
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం గాంధీనగర్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో తమ్ముడిని కొట్టి చంపాడు. గాంధీనగర్ కు చెందిన కుంచ రాజం, రాజమ్మ దంపతుల కొడుకులు రాము, విజయ్‌కుమార్(26) మద్యానికి బానిసలయ్యారు. రోజూ మద్యం తాగుతూ.. తరచూ గొడవ పడుతుండేవారు. సోమవారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో విజయ్ కుమార్తలపై అన్న రాము కట్టెతో బలంగా కొట్టడంతో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.