తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి

మహబూబాబాద్​అర్బన్, పెనుబల్లి, ఊట్కూర్, నిర్మల్, వెలుగు : వడదెబ్బతో ఆదివారం నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్​పట్టణం వాటర్​ట్యాంక్​బజారుకు చెందిన జమాలపురి నాగేందర్ మండుతున్న ఎండలతో వడదెబ్బకు గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం మరణించాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని సూరయ్య బంజర గ్రామానికి చెందిన భూక్యా రాము (45) ఈ నెల మూడో తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. 

ఆదివారం వీఎం బంజర్, బయ్యన్న గూడెం మధ్యలో ఉన్న చెరువు సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బతో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బోడెనోళ్ల రాములమ్మ (61) వడదెబ్బతో చనిపోయింది. వాంతులు, విరేచనాలై మృతి చెందింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట కు చెందిన కాళ్ల లక్ష్మి అలియాస్ గంగమ్మ (75) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది.