ములుగు, వెలుగు: నకిలీ పోడుపట్టాలను సృష్టించిన ముఠాను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. గురువారం ములుగు జిల్లా అటవీ కార్యాలయంలో డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ములుగు మండలంలోని కాసిందేవిపేట కేంద్రంగా జరిగిన నకిలీ పోడు పట్టాల తయారీ దందాలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించామన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుంపురాకి చెందిన చందావత్ భద్రు, నెక్కొండ మండలం అమినాబాద్ కు చెందిన భూక్య వెంకన్న, వరంగల్ లోని గణేశ్ప్రింటర్స్ యజమాని తాటిపాముల రాజు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఇంచించెర్వుపల్లికి చెందిన జాటోతు రాజ్ కుమార్ నకిలీ పట్టాల దందాను చేపట్టారు. వీరికి కాసిందేవిపేటకి చెందిన వాంకుడోతు రవి అమాయక రైతుల నుంచి పోడు పట్టాల ఆశచూపి డబ్బులు వసూలుచేయడం, పట్టాలను విక్రయించడం చేశాడని తెలిపారు. ప్రస్తుతం రవి అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపారు. తమ పరిధిలో ఈ ఐదుగురు నిందితులను ప్రాథమికంగా విచారించినట్లు తెలిపారు.
ములుగు జిల్లాతోపాటు మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో ఈ దందాను కొనసాగించారని, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవో, డీఎఫ్ఎల సంతకాలను ఒరిజినల్ పట్టా పుస్తకం నుంచి సేకరించి నకిలీ పట్టాలను తయారు చేసేందుకు టెక్నాలజీని వాడుకున్నారన్నారు. ప్రస్తుతం ములుగు బ్యాంకు నుంచి ఆరు నకిలీ పట్టా పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని, తమ దర్యాప్తులో ఒక కంప్యూటర్, 400ల నకిలీ పట్టాలు సీజ్ చేశామన్నారు. సేకరించిన పత్రాలు, ఆధారాలను, సీజ్ చేసిన కంప్యూటర్లతో సహా నిందితులను పోలీస్ శాఖకు ఫిర్యాదు చేసి అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రెస్మీట్లో ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.