- వెయ్యి కిలోల గంజాయి పట్టివేత
- ఒడిశా నుంచి మహారాష్ట్రకు రవాణా
- నలుగురిని అరెస్టు చేసిన టీ న్యాబ్
- పట్టుబడ్డ గంజాయి విలువరూ.3.5 కోట్లు
హైదరాబాద్, వెలుగు : ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టీఎస్ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్) మంగళవారం అరెస్ట్ చేసింది. రూ.3.5 కోట్లు విలువ చేసే వెయ్యి కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, కార్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుంది. ఈ గ్యాంగ్ వివరాలను టీన్యాబ్ ఎస్‌పీ సునీతారెడ్డి వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా వల్లేపూర్‌కు చెందిన సకరం రాథోడ్(35) కొన్నేండ్ల కింద హైదరాబాద్ వలస వచ్చాడు. ఆరేండ్ల పాటు పానిపూరి బండి వద్ద పనిచేశాడు. 2010లో షేక్‌పేట్‌లోని గెలాక్సీ థియేటర్ వద్ద సొంతంగా పానిపూరి బిజినెస్ ప్రారంభించాడు.
బిజినెస్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రెండేండ్ల తర్వాత సొంతూరుకు వెళ్లిపోయాడు. బీదర్ జన్వాడలోని షుగర్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులు గంజాయికి అలవాటుపడడం గుర్తించాడు. బీదర్, మహారాష్ట్రలో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో సప్లయ్‌కి ప్లాన్ చేశాడు. తన ఫ్రెండ్స్‌లో లారీ డ్రైవర్ అహ్మద్‌ఖాన్(27), దిగంబర్ రామ్ పవార్(30), థాణేకు చెందిన అజయ్ రామవతార్(39)తో కలిసి ఏపీ, ఒడిశా ఏజెన్సీ ఏరియాల నుంచి గంజాయి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాడు.
గంజాయి కోసం స్పెషల్ ట్రేలు
ఈ ముఠా ఒడిశా మల్కాన్‌గిరికి చెందిన సన్యాసిరావు, కాశీరామ్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నది. గంజాయి ట్రాన్స్‌పోర్ట్ కోసం రూ.8 లక్షలతో 100 ట్రేలు కొన్నారు. 100 ట్రేలలో వెయ్యి కిలోల గంజాయిని ప్యాక్ చేసి డీసీఎం వ్యాన్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. డీసీఎం ముందు సకరమ్ రాథోడ్, అజయ్ రామవతార్ ట్రావెల్ చేస్తుండేవారు. పోలీస్ చెకింగ్స్ నుంచి తప్పించుకుంటూ హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర చేరుకోవాలని ప్లాన్ చేశారు. టీఎస్ న్యాబ్ అధికారులకు అందిన సమాచారంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సిక్రిందాబాద్ బొల్లారం వద్ద చెక్‌పోస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సకరం రాథోడ్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వెయ్యి కిలోల గంజాయి, డీసీఎం, కారు సీజ్ చేశారు. వీటి విలువ రూ.3.5కోట్లు ఉంటుందని అంచనా వేశారు.