![Telangana Travel : ఈ వీకెండ్ మెదక్ చూసొద్దామా.. ఫ్యామిలీతో సరదాగా..](https://static.v6velugu.com/uploads/2023/09/Four-places-to-visit-in-Medak-in-Telangana_QFvHafgmS2.jpg)
కాకతీయులు, బహమనీ సుల్తాన్ల తర్వాత గోల్కొండ రాజులు కూడా మెదక్‌ను పాలించారు. ఇక్కడికి వెళ్తే రాజుల కాలంలో కట్టించిన కోట, ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చి చూడొచ్చు. అంతేకాదు మంజీర నది పరవళ్లు తొక్కే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తే... పచ్చని చెట్ల మధ్య నడుస్తూ సేదతీరొచ్చు. అడవి జంతువులతో పాటు రకరకాల పక్షులు కనిపిస్తాయి. మార్గమధ్యంలో ఏడుపాయల కనకదుర్గమ్మ ఆశీస్సులు కూడా తీసుకోవచ్చు.
మెదక్ కోటను12 వ శతాబ్దంలో కాకతీయులు కట్టించారు. 90 మీటర్ల ఎత్తున్న గుట్ట మీద దాదాపు 100 ఎకరాల స్థలంలో విస్తరించింది మెదక్ కోట. ఒకప్పుడు దీన్ని ‘మెతుకుదుర్గం’ అని పిలిచేవాళ్లు. ఈ కోటలో ప్రధమ, గజ, సింహద్వారం అని మూడు ప్రధాన ద్వారాలుంటాయి. సింహద్వారం దగ్గర రెండు వైపులా గర్జిస్తున్న సింహాల బొమ్మలు కనిపిస్తాయి. గజ ద్వారానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలుంటాయి. కోట మొదట్లో రెండు తలల గండభేరుండ పక్షి బొమ్మ చూడొచ్చు.
ఏడుపాయల దుర్గమ్మ
పాపన్నపేట మండలంలోని ఏడుపాయల కనకదుర్గ అమ్మవారు ‘ఏడుపాయల వనదుర్గా భవాని’గా చాలా ఫేమస్. ఇక్కడ మంజీర నది ఏడు పాయలుగా ప్రవహిస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి ‘ఏడుపాయల’ అని పేరొచ్చింది. ఈ గుడి గురించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. జనమేజయుడు రాజుగా ఉండగా పాములన్నింటిని నాశనం చేయాలని ‘సర్పయాగం’ చేశాడట. దాంతో నాగుల తల్లి తమని కాపాడండని దేవుళ్లను వేడుకున్నదట. అప్పుడు గరుత్మంతుడు పాతాళంలోని బోగవతీ నదిని భూమ్మీదకు తెచ్చాడట. యాగం జరిగే దగ్గరికి రాగానే ఆ నది ఏడు పాయలుగా చీలి ప్రవహించిందట. ఒక పాయ రాతిగుహలో ఉన్న కనకదుర్గ పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందనే కథ చెప్తుంటారు స్థానికులు.
కుల్చారం జైన మందిరం
కొలనుపాకతో పాటు చాలా ప్రాంతాల్లో జైన మందిరాలు, జైన శిల్పకళ కనిపిస్తాయి. కుల్చారంలో ‘శ్రీ పార్శ్వనాథ దిగంబర జైన దేవాలయం’ ఉంది. ఇక్కడ నల్లని రాయి మీద చెక్కిన 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి నిలువెత్తు విగ్రహం ఉంటుంది. 11 అడుగుల మూడు అంగుళాల పొడవున్న ఈ విగ్రహం తల మీద ఏడు పాములు ఉంటాయి.
పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ
నిజాం రాజులు ఈ ప్రాంతంలో వేటాడేవాళ్లని చెప్తారు. ఇక్కడికి దగ్గర్లోనే పోచారం చెరువు ఉండడంతో ఈ శాంక్చురీకి ఆ పేరొచ్చింది. ఇది మొత్తం130 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ రకరకాల చెట్లు, పక్షులతో పాటు చిరుతపులి, తోడేళ్లు, మచ్చల జింక, నీల్గాయ్, నాలుగు కొమ్ముల జింకలు, ఎలుగుబంటి వంటి జంతువుల్ని చూడొచ్చు. ఈ ప్లేస్‌కి దగ్గర్లో పోచారం డ్యాం, జలాశయం కనిపిస్తాయి.
ఆసియాలోనే రెండోది
తెలంగాణలో చూడదగ్గ ప్లేస్ల్లో మెదక్ చర్చి ఒకటి. ఇది ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చి. బ్రిటిష్ కాలంలో కట్టిన ఈ చర్చిని ‘మెదక్ కేథడ్రల్’ అని పిలుస్తారు. దీన్ని చార్లెస్ వాకర్ ఫాస్నెట్ అనే క్రిస్టియన్ మత గురువు కట్టించాడు. ఈ చర్చి నిర్మాణంలో రాళ్లు, డంగుసున్నం వాడారు. ఈ చర్చి కట్టడం వెనక... కరువుతో అల్లాడుతున్న మెదక్ ప్రజల ఆకలి తీర్చాలనే ఆలోచన ఉందని చెప్తారు. 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవు ఉన్న ఈ చర్చి ప్రాంగణం 300 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడి బెల్ టవర్ 73 అడుగుల ఎత్తులో ఉంటుంది. చర్చిలోని గాజు కిటికీల మీదున్న రంగురంగుల బొమ్మలు ఏసుక్రీస్తు జీవితంలోని ముఖ్యమైన సంఘటనల్ని కళ్ల ముందు నిలుపుతాయి. క్రిస్మస్, ఈస్టర్ వంటి పండుగల టైంలో క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రార్థనలు చేస్తారు.
ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది మెదక్. ఏడుపాయల కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లేందుకు మెదక్ నుంచి 20 కిలోమీటర్లు జర్నీ చేయాలి. మెదక్ నుంచి 15 కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తే పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ వస్తుంది.