బాపట్ల జిల్లాలో ఓటరు జాబితా సేకరణకు యత్నించిన నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసి ఖాళీల రిజర్వ్ (వీఆర్ )పంపారు.ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ఈసీ యాక్షన్ లోకి దిగి.. పలువురు అధికారులను సైతం సస్పెండ్ చేసింది. తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై వీరు నిబంధనలకు వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకొచ్చి.. ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలకు సమర్పించారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం7 దరఖాస్తుల సమాచారాన్ని తీసుకోవడమే కాకుండా బీఎల్ఓ లపై ఓట్ల తొలగింపు కోసం ఒత్తిడి చేశారనే ఆరోపణలపై మార్టూరు సిఐ టి.ఫిరోజ్, పర్చూరు ఎస్ఐ ఎన్ సి.ప్రసాద్, మార్టూరు ఎస్ఐ కె.కమలాకర్, గతంలో యద్దనపూడి ఎస్ఐ గా పనిచేసిన కె.అనూక్ లను అధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు రేంజి ఐజి పాలరాజు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఎస్ పి వకుల్ జిందాల్ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
బాపట్ల జిల్లాలో గత జులై నుంచి ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పర్చూరులో 40 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, గ్రామాల వారీగా ఉన్న దొంగ ఓట్లను తాము గుర్తించామని అధికార వైసిపి నేతలు అప్పట్లో ప్రకటించారు. వాటిని తొలగించేందుకు గ్రామాలలోని వైసీపీ అనుయాయులతో ఫారం7 దరఖాస్తులను ఆన్ లైన్ నమోదు చేయించారు. దీంతో, దొంగ ఓట్ల పేరుతో పర్చూరులో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు వైసీపీ వారు కుట్ర చేస్తున్నారంటూ పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పర్చూరులో ఓటర్ల జాబితా తయారీలో మహిళా పోలీసులను బీఎల్ఓ లుగా నియమించారు. వారితో పోలీస్ అధికారులు మార్టూరు, యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేసి, ఫారం 7 ద్వారా దాఖలైన దరఖాస్తుల విషయంలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీస్ అధికారులు బీఎల్ఓ లతో జరిపిన వాట్సాప్ చాట్ లను సేకరించిన ఎమ్మెల్యే వాటి స్క్రీన్ షాట్లతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పర్చూరు నియోజకవర్గంలో 189 మంది ...14 వేల ఓట్ల తొలగింపునకు అక్రమ మార్గంలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసినట్లు, వాటిపై బీఎల్ఓ లు తీసుకోవలసిన చర్యల గురించి సీఐ, ఎస్ ఐలు బూత్ లెవల్ ఆఫీసర్లుగా ఉన్న వారితో వాట్సాప్ చాట్ ద్వారా ఆదేశాలు ఇచ్చినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దీనిపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా విచారణ చేయించారు. మార్టూరు సీఐ, ముగ్గురు ఎస్ ఐ లకు బీఎల్ఓ లు ఫారం నెంబర్:7లో సమాచారం పంపినట్లు తేలడంతో ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపారు. ఈ అంశం ఎన్నికల కమిషన్ తోపాటు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ..పోలీస్ అధికారులను వీఆర్ కు ( వేకెన్సీ రిజర్వ్డ్) పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్ తో పాటు కోర్టులో సమాధానం చెప్పుకోవడం కష్టమని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు ఆ నలుగురినీ సస్పెండ్ చేస్తూ మంగళవారం (అక్టోబర్ 24) ఉత్తర్వులు జారీ చేశారు.