- నలుగురు సైనికులు మృతి, 60 మందికి గాయాలు
- ఐడీఎఫ్ చీఫ్ కూడా చనిపోయినట్లు ప్రచారం
- అవన్నీ వదంతులేనని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడి
- ఇజ్రాయెల్‌కు మిసైల్స్‌ను అడ్డుకునే అత్యాధునిక ‘థాడ్’ సిస్టమ్‌ను పంపిన అమెరికా
- ఉత్తర లెబనాన్‌పై ప్రతిదాడి చేసిన ఇజ్రాయెల్
జెరూసలెం, డీర్ అల్ బాలా: ఇజ్రాయెల్ మిలిటరీ బేస్‌పై హెజ్బొల్లా ఆదివారం డ్రోన్లతో భీకర దాడులు చేసింది. ఈ అటాక్‌లో నలుగురు సైనికులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. హైఫా సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిన్యామినా క్యాంపుపై ఈ దాడి జరిగింది. గత నెల 23 తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ బేస్ పై జరిగిన అతిభీకర దాడి ఇదే. మానవరహిత విమానాలను ఈ దాడిలో హెజ్బొల్లా టెర్రరిస్టులు ఉపయోగించారు. ఐడీఎఫ్ గోలాన్ బ్రిగేడ్ కు చెందిన శిక్షణ శిబిరంపై ఈ దాడి జరిగింది. ఏకకాలంలో పదుల సంఖ్యలో డ్రోన్లు విరుచుకుపడడంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పనిచేయకుండాపోయాయి. మిర్సాద్ 1 రకం డ్రోన్లను హెజ్బొల్లా ఈ దాడికి ఉపయోగించిందని టెల్ అవీవ్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఐడీఎఫ్ చీఫ్ హెర్జీ హేలవీ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అదంతా ఒట్టి పుకారేనని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. అమెరికా కూడా ఆ వార్తలను ఖండించింది. ఇక హెజ్బొల్లా దాడిలో గాయపడిన 60 మందిలో కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఇది సాంపిల్ మాత్రమే
ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరంపై తాము చేసిన దాడి సాంపిల్ మాత్రమేనని, మరిన్ని భీకర దాడులు చేస్తామని హెజ్బొల్లా హెచ్చరించింది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే తాజాగా డ్రోన్లతో బిన్యామినా సైనిక స్థావరంపై దాడి చేశామని పేర్కొంది.
పీస్ కీపర్లను తరలించండి: నెతన్యాహు
దక్షిణ లెబనాన్‌లోని ప్రమాదకర ప్రాంతం నుంచి పీస్ కీపర్లను తరలించాలని యునెటైడ్ నేషన్స్ (యూఎన్) కు చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. పీస్ కీపర్లను హెజ్బొల్లా టెర్రరిస్టులు మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. కాగా, తమ మిలిటరీ స్థావరంపై హెజ్బొల్లా చేసిన దాడితో ఇజ్రాయెల్ వెంటనే ఉత్తర లెబనాన్ పై ప్రతి దాడి చేసింది. సోమవారం ఐతో గ్రామంలో ఓ భవనంపై బాంబులు ప్రయోగించడంతో 18 మంది చనిపోయారని లెబనాన్ రెడ్ క్రాస్ తెలిపింది.