నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లోని విగ్రహాలు, నగలు చోరీ చేసిన కేసుల్లో నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీసులో మీడియాకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం కల్వకుర్తిలో తనిఖీలు నిర్వహిస్తుండగా, తప్పించుకునేందుకు ప్రయత్నించిన కొండపల్లి ఆంజనేయులు, కొండపల్లి స్వామి, సిరిగిరి శంకర్, కొండపల్లి శివప్రసాద్ లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కల్వకుర్తి పట్టణంలోని వేంకటేశ్వర స్వామి, పద్మావతి విగ్రహాలతో పాటు ఇత్తడి వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు.
భూదేవి అమ్మవారి తాళిబొట్లు, ప్లేట్లు, 4 చైన్లు, బంగారు గాజులు, బ్రాస్లెట్, గోల్డ్ చైన్ దొంగలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షల విలువ చేసే 5 బైకులు, 1.6 తులాల బంగారం,21.9 తులాల వెండి, 58.84 కేజీల ఇత్తడి వస్తువులు రికవరీ చేసినట్లు తెలిపారు.
కొండపల్లి ఆంజనేయులుపై 16 కేసులు, కొండపల్లి స్వామిపై 11 కేసులు, కొండపల్లి శివప్రసాద్ పై రెండు కేసులు, సిరిగిరి శంకర్ పై ఒక కేసు నమోదైనట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న డీఎస్పీ పార్థసారథి, సీఐ ఆంజనేయులు, ఎస్ఐ రమేశ్, కానిస్టేబుళ్లు రాజు, చిరంజీవి, నజురుద్దీన్లకు రివార్డు అందజేశారు.