నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసిన్రు : తమ్మినేని వీరభద్రం

  • 3 వేల గడీలు బద్దలు కొట్టి...10 లక్షల ఎకరాలు పంచిన్రు
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
  • భద్రాచలంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ

భద్రాచలం, వెలుగు : వీర తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర ద్రోహులుగా మిగులుతారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి బ్రిడ్జి నుంచి అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటం గురించి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నాయని..తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టు త్యాగాల చరిత్ర అని ఒప్పుకునే దమ్ము ఆ పార్టీలకు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించి నిజాం గడీలను బద్దలు కొట్టి మూడువేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను స్థాపించారన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారని, దీనికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులేనన్నారు. సాయుధ పోరాట చరిత్రను ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాడిన చరిత్రగా బీజేపీ మసిబూసి మారేడు కాయ చేస్తోందన్నారు. నాటి నిజాం పరిపాలనలో భూమి, వెట్టి, మాతృభాషలో విద్య లాంటి అంశాల చుట్టే తెలంగాణ ప్రజలు పోరాటాలు చేశారన్నారు. రాజు ముస్లిం అయినప్పటికీ రాజు సంస్థానంలో పనిచేసే పటేల్, పట్వారీ, దేశ్ ముఖ్​లు హిందువులేనని, ప్రజలపై అత్యాచారాలు సాగించింది కూడా వారేనన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎందుకంటే నిజాం నవాబు దాష్టీకానికి బలైన కమ్యూనిస్టు కార్యకర్తల కంటే నెహ్రూ, పటేల్ సైన్యం పంపించిన సైన్యం దాడిలో మరణించిన కమ్యూనిస్టు కార్యకర్తలే ఎక్కువమంది ఉన్నారన్నారు.

నిజంగా నెహ్రూ సైన్యం నిజాం రాజును గద్దె దించడానికి పంపించినట్లయితే రాజభరణం పేరుతో నిజాంకు ఎందుకు ఊడిగం చేశారని, తెలంగాణకు రాజ్​ ప్రముఖ్ గా ఎందుకు నియమించారో ప్రజలకు తెలియజేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీనియర్ లీడర్లు కాసాని ఐలయ్య, ఎలమంచి రవి కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేశ్, కొక్కెరపాటి పుల్లయ్య, ఎంబీ నర్సారెడ్డి, కే బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం స్వామి, ఎం.రేణుక, చిరంజీవి నాయుడు, రేపాకుల శ్రీను, నిమ్మల వెంకన్న, భూక్య రమేశ్, వీర్ల రమేశ్, గద్దల శ్రీను, చిలకమ్మా, వంశీ, యాస నరేశ్, బత్తుల వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, బి వెంకటరెడ్డి, వై.వెంకట రామారావు, సంతోష్, లీలావతి పాల్గొన్నారు.