ఫాంహౌజ్ ఘటన : మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు భద్రత

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కే పరిమితమయ్యారు. తమ తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా 11 రోజులుగా ప్రగతిభవన్ లో ఎమ్మెల్యేలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులకు మంత్రులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సెక్యూరిటీని పెంచింది. 

మొయినాబాద్ ఫాం హౌస్ ఘటన తర్వాత ప్రగతిభవన్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్  గత నెల 30వ తేదీన మునుగోడుకు వెళ్లారు. ఆ సమయంలో తన వెంట హెలికాఫ్టర్ లో నలుగురు ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లారు. ఆ సభ తర్వాత మళ్లీ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ తో ప్రగతిభవన్ కే వెళ్లారు. తమ నియోజకవర్గాలకు వెళ్లలేదు. ఈనెల 3వ తేదీన ప్రగతిభవన్ లో  నిర్వహించిన ప్రెస్ మీట్ లో నలుగురు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే కనిపించారు.

మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సన్నిహితులకు కూడా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లోకి రావడం లేదని తెలుస్తోంది. కేవలం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతోనే టచ్ లోకి వస్తున్నారని సమాచారం.