Good Health: ఇంట్లోనే తయారు చేసుకునే ఈ నాలుగు రకాల పాలు కూడా ఎంతో ఆరోగ్యం.. పిల్లలు, పెద్దలు ట్రై చేయండి..!

Good Health: ఇంట్లోనే తయారు చేసుకునే ఈ నాలుగు రకాల పాలు కూడా ఎంతో ఆరోగ్యం.. పిల్లలు, పెద్దలు ట్రై చేయండి..!

అప్పుడే పుట్టిన చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ పాలు తాగాలి. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే రోజూ గ్లాసు ఆవు లేదా గేదె పాలు తాగితే చాలారకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కానీ కొంతమందికి ఆ పాలే కొత్త సమస్యలను తెచ్చిపెడతాయి. అదేంటీ? అంటారా! అవును మరి..! ఈ సమస్యకు ఎలా చెక్​ పెట్టాలో తెలుసుకుందాం. . .

చాలామంది పాలు తాగడంతోనే వాంటింగ్​ చేసుకుంటారు.. మరి కొంతమందికి అలర్జీ వస్తుంది.   పిల్లల్లో కనిపించే అత్యంత సాధారణ ఆహార అలర్జీలో పాలు కూడా ఒకటి.  పాల అలర్జీ ఉంటే  పాల ఉత్పత్తులు ఏది తిన్నా కూడా ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ కొంతమంది పిల్లలు పాల అలర్జీని అధిగమిస్తారు. పాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. పాలలో ఉండే లాక్టోస్ అనే పదార్థం కొంతమందికి పడదు. ఈ అలర్జీ పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఉంటుంది. పడని వాళ్లు పాలు తాగితే... దగ్గు, వాంతులు. గొంతు నొప్పి, కడుపులో తిప్పడం, శ్వాస సరిగా ఆడకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి వాళ్లు లాక్టోస్ లేని పాలను తాగొచ్చు. ఆ పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు... అదెలాగంటే...

బాదం మిల్క్​: ఈ పాలను తాగితే  రోజుకు సరిపడా విటమిన్ -డిలో 25శాతం, విటమిన్ -ఇ లో 50 శాతం లభిస్తాయి. ఇందులో విటమిన్లతో పాటు కాపర్, జింక్, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.

తయారీకి కావాల్సినవి 

  • బాదం గింజలు - 1 కప్పు
  •  నీళ్లు - 2 కప్పులు 
  • తేనె లేదా చక్కెర - సరిపడా 

తయారీ విధానం: రాత్రంతా బాదం గింజలను సరిపడా నీళ్లలో నానబెట్టాలి. ఉదయమే నీళ్లను వంపేసి బాదం పప్పు పొట్టును తీపేయాలి. తర్వాత మిక్సీ గిన్నెలో బాదం..  రెండు కప్పుల నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. మిశ్రమాన్ని మళ్లీ వడగట్టి పిప్పి, పాలను వేరు చేయాలి. ఆ బాదం పాలలో చక్కెర లేదా తేనె కలుపుకుని తాగొచ్చు. పిల్లలు వీటిని ఇష్టంగా తాగుతారు

జీడిపప్పు పాలు : ఈ పాలను మాములుగా కాఫీ పెట్టుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు అలాగే తయారీలో కూడా వాడొచ్చు, ఇందులో క్యాలరీలు చక్కర శాతం తక్కువగా ఉంటాయి. అలాగే టిప్టోఫెన్ అనే హార్మోన్ విడుదలకు ఈ పాలు ఉపయోగపడతాయి. ఆ హార్మోన్ మెదడు... గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చర్య సౌందర్యానికి ఈ జీడిపప్పు పాలు తోడ్పడతాయి. 

తయారీకి కావాల్సినవి 
 

  • జీడిపప్పు - 1 కప్పు 
  • ఖర్జూరాలు - 2
  • నీళ్లు -4 కప్పులు 
  •  దాల్చినచెక్క పొడి- పావు టీస్పూన్
  • ఉప్పు - చిటికెడు 

తయారీ విధానం: జీడిపప్పును రాత్రంతా నానబెట్టాలి. అలా కుదరకపోతే వాటిని వేడి నీళ్లలో 15 నిమిషాల పాటు నానబెట్టినా సరిపోతుంది. తర్వాత నీళ్లలో నుంచి వాటిని తీసి మిక్సీ గిన్నెలో వేయాలి. అలాగే గింజలు తీసిన ఖర్జూరాలు, ఉప్పు .. దాల్చిన చెక్క పొడి నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి.. ఆ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకుని కొంత సేపు ఫ్రిజ్​ లో  పెట్టి తర్వాత తాగొచ్చు. 

సోయా పాలు : ఈ పాలను సోయాబీన్స్ నుంచి తయారు చేయాలి. ఆవు పాలు పడని వాళ్లు వీటిని తీసుకోవడం వల్ల అందులో పుష్కలంగా ఉండే విటమిన్- బి అందుతుంది. రోజుకు కావాల్సినంత పోలిక్ యాసిడ్​ లో  పది శాతం ఈ సోయాపాలలో లభిస్తుంది. అలాగే ఇందులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. కాబట్టి ఇవి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లు వీటిని తాగొచ్చు. సోయా పాలలో ప్రొటీన్లు, ఐరన్, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. 

తయారీకి కావలసినవి

  • సోయా బీన్లు – అరకప్పు
  • నీళ్లు 7– కప్పులు 
  • చక్కెర - సరిపడా 

తయారీ విధానం: ముందుగా సోయాగింజలను మూడు కప్పుల నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయమే నీళ్లన్నీ వంపేసి, గింజల మీద పొట్టంతా పోయేలా కడగాలి. తర్వాత ఆ గింజలను మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 4 కప్పుల నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడగట్టి పిప్పిని తీసేసి, పాలను మరోగిన్నెలోకి తీసుకోవాలి వాటిని ఇరవై నిమిషాల పాటు మరిగించి, చక్కెర కలుపుకొని తాగొచ్చు

కొబ్బరి పాలు: ఈ పాలలో లాక్టోస్​  అసలు ఉండదు. అందుకే లాక్టోస్ అలర్జీ ఉన్నవాళ్లకు ఇవిసరైన ఎంపిక ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు  గుండె సంబంధిత వ్యాధులు రాకుండా. కాపాడతాయి. కాకపోతే వీటిలో ఫైబర్, ఐరన్, శాచ్యురేటెడ్ ఫ్యాట్లు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని అన్నింట్లోకి వాడకూడదు. మార్కెట్ లో దొరికే కొబ్బరిపాల కన్నా ఇంట్లో చేసుకునేవే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

తయారీకి కావాల్సినవి 

  • గోరువెచ్చని నీళ్లు - 4 కప్పులు. 
  • పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు

 తయారీ విధానం: మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి తురుము, గోరువెచ్చని నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. మిశ్రమం చిక్కగా అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో మెత్తగా అవ్వని కొబ్బరి ఉంటే, దాన్ని మళ్లీ గ్రైండ్ చేయాలి. అలా మిక్సీ పట్టిన పాలను అప్పుడే తాగేయొచ్చు లేదా ఫ్రిజ్​ లో పెట్టి తర్వాత అయినా తాగవచ్చు.  


–వెలుగు,లైఫ్​‌‌–