నల్గొండ జిల్లాలో సంక్షేమ పథకాల సంబురం

నల్గొండ జిల్లాలో సంక్షేమ పథకాల సంబురం
  • ప్రారంభమైన నాలుగు స్కీమ్స్ 

యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : రిపబ్లిక్​ డే రోజున ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంక్షేమ పథకాల సంబురం ప్రారంభమైంది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్​ కార్డులు అందాయి. అదే విధంగా రైతులతోపాటు భూమి లేని కూలీలకు భరోసా అందింది. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్లు స్వీకరించిన ప్రభుత్వం కుటుంబ సర్వే నిర్వహించింది.

 ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో మరోసారి అప్లికేషన్లు తీసుకుంది. వీటిని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారిని నాలుగు స్కీమ్స్​లో లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. రిపబ్లిక్​ డే నుంచి ఈ స్కీమ్స్​అమలు చేస్తామని ప్రకటించినందున పైలట్​గా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసుకొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్​కాపీలను అందజేశారు. 

నల్గొండ జిల్లాలో 41,922 మంది..

నల్గొండ జిల్లాలో 33 మండలాలు ఉండగా, గట్టుప్పల్, గుడిపల్లి మండలాల్లో మినహా 31 మండలాల్లో 31 గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందించారు. రైతు భరోసా కింద 31.556 మంది రైతులకు రూ.46.93 కోట్లు అందించారు. కొత్త రేషన్ కార్డులు 4976 మంది లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇండ్లు 4677 మంది, ఆత్మీయ భరోసాకు 713 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. 

యాదాద్రిలో 20,027 మంది..

యాదాద్రి జిల్లాలో కొత్తగా అమల్లోకి వచ్చిన నాలుగు స్కీమ్స్​లో లబ్ధిదారులుగా ఎంపిక చేసినవారిలో 20,027 మందికి ఆదివారం ప్రొసీడింగ్​కాపీలను పంపిణీ చేశారు. వీటిని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి అందించారు. 

రైతు భరోసా స్కీమ్​లో ఎంపికైన వారిలో 17,644 మందికి ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.269.95 కోట్లను అకౌంట్లలో జమ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంపికైనవారిలో 329 మందికి రూ.6 వేల చొప్పున అందాయి. రేషన్​కార్డులకు ఎంపికైన వారిలో 910 మందికి, ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులుగా ఎంపికైన వారిలో 1,144 మందికి సర్టిఫికెట్లు అందించారు. 

సూర్యాపేటలో 37,259..

నాలుగు సంక్షేమ పథకాలను సూర్యాపేట జిల్లాలో 23 మండలంలోని 23 గ్రామాల్లో అర్హులైన 37,259 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పలువురు లబ్ధిదారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రొసీడింగ్ కాపీలు అందించారు. రైతు భరోసా పథకం కింద 29,352 మంది రైతులకు రూ.26.73 కోట్లను వారి అకౌంట్లలో జమ చేశారు. కొత్త రేషన్ కార్డులు జిల్లాలో 2,350 మందికి అందించారు. 4,140 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద  1,458 మందికి మంజూరు పత్రాలు అందజేశారు.