వెస్టిండీస్ క్రికెట్‌లో సంచలనం.. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు ప్లేయర్లు

వెస్టిండీస్ క్రికెట్‌లో సంచలనం.. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు ప్లేయర్లు

క్రికెట్ లో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆ లోటు పూడ్చలేనిది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందకు.. ఆ ఆటగాడిని మర్చిపోయేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఒకేసారి నలుగురు స్టార్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ..   ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేస్తుంది. విండీస్ మహిళా జట్టులో కీలక ప్లేయర్లైనా  అనిషా మహ్మద్, షకేరా సెల్మాన్, కైసియా నైట్, కైషోనా నైట్ లు ఒకేసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 
 
ఈ నలుగురు కూడా 2016లో T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యులు. 2024 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. విండీస్ ప్లేయర్లు టీ20 క్రికెట్ మెరుగ్గా ఆడతారు. ఇలాంటి సమయంలో వీరు క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విండీస్ క్రికెట్ బోర్డ్ పరిస్థితి బాగోలేదు. కొన్నిసార్లు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజ్ కూడా అందటం లేదు. ఈ కారణంగానే ఈ నలుగురు మహిళా క్రికెటర్లు తమ కెరీర్ లకు ముగింపు పలుకుతున్నారని అక్కడి మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

ఆఫ్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్ 2003లో 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 141 వన్డేల్లో 180 వికెట్లు తీయగా, 117 T20I మ్యాచ్‌లలో 125 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్ తరపున  5 వన్డే వరల్డ్ కప్ లు, 7 టీ20 వరల్డ్ కప్ లు ఆడింది. మీడియం పేస్ బౌలర్ షకేరా సెల్మాన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను 2008లో ప్రారంభించింది. 100 వన్డేల్లో 82 వికెట్లు, 96 T20Iల్లో 51 వికెట్లను పడగొట్టింది.  కైసియా 2011 లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన.. ఈమె 87 వన్డేలు, 70టీ20 మ్యాచ్ లు ఆడింది. కైషోనా నైట్ 2013 లో అరంగేట్రం చేసి 51 వన్డేలు, 55 టీ20లు ఆడింది.