మట్టి దిబ్బ కూలి నలుగురు మహిళలు మృతి.. శిథిలాల కింద మరో 10 మంది

మట్టి దిబ్బ కూలి నలుగురు మహిళలు మృతి.. శిథిలాల కింద మరో 10 మంది

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. మట్టి దిబ్బ కూలి నలుగురు మహిళలు మృతి చెందారు. ఇంకో డజనుకు పైగా మహిళలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం(నవంబర్ 12) ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

తమ ఇంటిలో జరిగే ఒక ఫంక్షన్ కోసం మహిళలు మట్టిని తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకవైపు నుంచి మట్టిని తవ్వుతుండగా.. దిబ్బ ఉన్నట్టుండి వారి మీద కూలింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇంకో డజనుకు పైగా మహిళలు శిథిలాల కింద చిక్కుకొని ఉంచొచ్చని అధికారులు భావిస్తున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, అత్యవసర బృందాలు, జిల్లా అధికారులు బాధితులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన ఇద్దరిని మహిళలను చికిత్స కోసం అలీఘర్‌ తరలించారు. మట్టి దిబ్బల కింద ఉన్నవారు సైతం ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు.

విచారం వ్యక్తం చేసిన యూపీ సీఎం

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.